మనుషులకు వుండాల్సిన మానవత్వం, జాలి, దయలాంటివి మంటగలిసిపోతున్నాయి. సాటి మనుషులపై ఎలాగైతే క్రూరంగా ప్రవర్తిస్తున్నారో, పశు పక్ష్యాదుల మీదా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు. మూగ జీవులపై అలా ప్రవర్తిస్తున్న మనుషులను చూస్తే ఈ ప్రపంచం ఎటు పోతోందో గదా అని బాధేస్తుంది, ఆందోళన కలుగుతుంది. తమ పెంపుడు జంతువులపట్లే క్రూరంగా ప్రవర్తించడం మరింత బాధిస్తుంది.
ఆ మధ్య ఓ వ్యక్తి తను పెంచుకుంటున్న కుక్కనే కారుకు కట్టేసి కొన్ని కిలో మీటర్ల మేర లాక్కెళ్లిన సంఘటనను చూశాం. అంతకు ముందు ఒక శాడిస్టు కర్రతో కుక్కను చావబాదిన వీడియోను చూసి ఎంతోమంది మండిపడ్డారు. ఇన్ని జరుగుతున్నా మనుషుల్లో మార్పు రావడం లేదు. రేపిస్టులకు ఎలాగైతే బుద్ధి రావడం లేదో, ఇలాంటివారికీ బుద్ధి రావడం లేదు. ఇప్పుడు మనం మాట్టాడుకోబోతున్న సంఘటనలో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కతో ఏకంగా పారా గ్లైడింగ్ చేయించాడు. అదేంటో ఓ లుక్కేద్దాం…!
పారా గ్లైడింగ్ చేయాలంటే చాలా ధైర్యం అవసరం. కామన్ గా ఒక్కరు లేదంటే ఇద్దరు మనుషులు పారా గ్లైడింగ్ చేస్తుంటారు. అలవాటు లేనివాళ్లు ట్రైనర్ సాయంతో గాల్లో తేలియాడుతుంటారు. కానీ, ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో పారాగ్లైడింగ్ చేసి ఆశ్చర్య పరిచారు. ఈ సమయంలో రికార్డు చేసిన వీడియోను నెట్ లో పెట్టారు. ఇప్పుడీ వీడియో వైరల్ అయింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
పారాగ్లైడింగ్ టైమ్ లో కుక్క చాలా భయపడిందంటూ సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క కళ్లలో చాలా భయం కనిపించిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. దాని కళ్లు చూస్తేనే ఈ విషయం అర్థం అవుతోందన్నాడు. ఇలాంటి చెత్త పనులు చేసి మూగ జీవాలను హింసించవద్దని మరికొందరు అభిప్రాయపడ్డారు. సాటి ప్రాణులు మనుషులైనా, పక్షులైనా, జంతువులైనా హింసించే హక్కు ఎవరికీ లేదు. ఈ వాస్తవాన్ని అందరూ గ్రహిస్తే బావుంటుంది.