ప్రగతి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం స్పష్టంచేసింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 11.30 వరకు కొనసాగింది. తొమ్మిదిన్నర గంటల పాటు సాగిన క్యాబినెట్ మీటింగ్‌లో సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘ కసరత్తు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అనుసరించాల్సిన కట్టడి వ్యూహం, ప్రజారోగ్యానికి తీసుకోవాల్సిన చర్యలపై రాజీపడొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
విద్యాసంస్థల బలోపేతానికి, ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డుకట్టవేయటానికి తీసుకోబోయే చర్యలపై చర్చించారు. వ్యవసాయం, నీటి పారుదల రంగాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల పురోగతిపై లోతుగా చర్చించారు. బడ్జెట్ రూపకల్పనపై ఆయా శాఖలు వారానికో సారి ప్రి బడ్జెట్ సమీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. దళితబంధు పురోగతిపైనా సమావేశం సమీక్షించింది. ధరణిపై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించింది.సుమారు 4 గంటలపాటు ధరణిపైనే మంత్రివర్గం చర్చించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల అకాల వర్షాలు కురవడంతో క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతీరాథోడ్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.