`హీరో` సినిమాలో ఫిమేల్ కేరెక్టర్ల నుంచి వచ్చే ఎమోషన్స్ కథలో బలమైన పాయింట్. ముఖ్యంగా హీరోకు హీరోయిన్ నుండే సమస్య వస్తుంది. అది ఏమిటి? అనేది చిత్ర కథ అని చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెలియజేశారు. 2015లో సుధీర్‌బాబుతో భలే మంచిరోజు, 2017లో శమంతకమణి, 2018లో దేవదాస్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ఇప్పుడు గల్లా అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తూ `హీరో` సినిమా రూపొందించారు.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడే అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు.
నా దగ్గరున్న కథకు అశోక్ కరెక్ట్‌గా సరిపోతాడని భావించి ఆయనతో సినిమా చేయాలనుకున్నాను. అశోక్ తన అమ్మగారు పద్మగారిని పరిచయం చేయడంతో ఆమెకూ నచ్చి సినిమా పట్టాలెక్కింది. అశోక్ కు సినిమాపై విపరీతమైన ఇంట్రెస్ట్ వుంది. నా దగ్గర వున్న కథకు కొత్తవారైతేనే పూర్తి న్యాయం జరుగుతుందనే అశోక్ ను తీసుకున్నాం .టైటిల్ పరంగా చెప్పాలంటే హీరో అవ్వాలనుకునే కుర్రాడి కథ కాబట్టి యాప్ట్ గా అనిపించింది.
చాలామంది ఏదో సందర్భంలో హీరో అవ్వాలనుకుంటారు. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఫీలింగ్ వుంటుంది. ఇది కామన్ పాయింట్ ఇది నా అనుభవంతో తీసిన కథకాదు. చుట్టూ స్టడీచేసి రాసుకున్న కథ. `హీరో` సినిమా ఎటువంటి విసుగు కలిగించకుండా కమర్షియల్ అంశాలతో తీశాం. చూసిన ప్రేక్షకుడు రెండు గంటలు నవ్వుకుంటూనే వుంటారు. అశోక్‌ను కొత్త హీరోని చూశామనే ఫీలింగ్ కలగదు.
జోనర్ పరంగా చెప్పాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ వుంటూనే ఇంతవరకు ఎవరూ స్కృశించని అంశం ఇందులో వుంటుంది. విడుదలైన టీజర్‌లో అశోక్ ను కౌబాయ్‌గా, జోకర్‌గా ఇలా చూసుంటారు. కథలో అటువంటి వైవిధ్యాలు కుదిరాయి. అశోక్‌ను చూస్తే కొత్తవాడనే ఫీలింగ్ రాకూడదని మెగాస్టార్ చిరంజీవి, మహేష్‌బాబు సినిమాలు చూడమని చెప్పాను. వారిలో కామేడీ టైమింగ్ నాకు బాగా నచ్చుతుంది. యాక్టింగ్ కోర్సు చేయడంకంటే చాలామంది స్టార్స్‌ను చూసి మనం చాలా నేర్చుకోవాల్సి వుంటుంది. వారిని పరిశీలించి మనకు నచ్చింది మనకు అప్లయ్ చేసుకోవాలి. అందుకే అశోక్‌ను సినిమాలు చూడమని చెప్పాను.హీరో యు.ఎస్.లో చదివినా తనకు తెలుగు రాయడం, మాట్లాడడం బాగా తెలుసు. నాకే సరిగ్గా తెలీదు. డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీలో పలు భాషా చిత్రాలు చూశాం. చాలామందికి కొన్ని నచ్చాయి కూడా. అలాంటివారికి కూడా హీరో సినిమా నచ్చుతుంది. ఎందుకుంటే రొటీన్ ఫార్మెట్ కాకుండా భిన్నంగా తీసిన సినిమా ఇది. థియేటర్లలో చూస్తేనే బాగుంటుంది.