అనాథలు జీవితంలో స్థిరపడేదాకా రాష్ట్ర ప్రభుత్వమే తల్లి, తండ్రిలా బాధ్యతలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేయనున్నది. రాష్ట్రంలో ఉన్న అనాథలందరినీ రాష్ట్ర బిడ్డల్లా పరిగణిస్తూ, వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని సమావేశం నిర్ణయించింది. గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం శనివారం రాష్ట్ర మహిళా డైరెక్టరేట్ కార్యాలయంలో సమావేశమైంది. మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్ర కరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో అనాథలకు ఉపాధి దొరికేదాకా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించారు. తెలంగాణను అనాథలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం సమగ్ర చట్టం రూపొందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు.
అనాథలకు ప్రత్యేక స్మార్ట్‌కార్డులు : అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ వారికి ప్రత్యేక స్మార్ట్ కార్డులు ఇవ్వాలని, ఈ కార్డు ఉంటే ఆదాయ, కుల ఇతర సర్టిఫికెట్‌లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉప సంఘం సూచించింది. ముస్లింలలో అనాథలకు యతీమ్‌ఖానాలు నిర్వహిస్తున్నారని, వాటిని కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్నివిధాలా వసతులు కల్పించి అండగా నిలబడాలని తెలిపారు. అనాథల కోసం చేసే ఖర్చును గ్రీన్‌చానల్ లో పెట్టాలని, దీనికి ఎస్సీ, ఎస్టీ ప్రగతి పద్దుకు ఉన్నట్టు నిధులు ఆ సంవత్సరంలో ఖర్చు కాకపోతే మరుసటి సంవత్సరానికి క్యారీఫార్వర్డ్ అయ్యేలా శాశ్వత ఆర్థిక భద్రత కల్పించేలా విధానాల రూపకల్పన జరగాలని సమావేశం అభిప్రాయపడింది. అనాథలకు ఆర్థిక సహాయం చేస్తే ట్యాక్స్ మినహాయింపు ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదని, ఈ అంశానికి ప్రాచుర్యం కల్పించాలని సూచించింది. నో చైల్డ్ బిహైండ్ నినాదంతో అనాథల కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) ద్వారా ముందుకు వచ్చే వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చి వారి సహాయాన్ని పొందే కార్యాచరణ రూపొందించాలని మంత్రులు వెల్లడించారు. అనాథలందరితో అలుమ్నీ నెట్‌వర్ ఏర్పాటు చేయాలని, గొప్ప స్థాయికి చేరుకొన్న అనాథల విజయగాథలను ఇతరులకు స్ఫూర్తిగా నిలిచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సిగ్నళ్ల వద్ద బిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు : అనాథల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటున్నా కొంతమంది పిల్లలను అడ్డుపెట్టుకొని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, వారితో సిగ్నళ్ల వద్ద భిక్షాటన చేయిస్తున్నారని మంత్రులు తెలిపారు. ఇలాంటివారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించి, కఠిన చర్యలు తీసుకొనేలా నూతన చట్టంలో నిబంధనలు రూపొందించాలని సూచించారు. పిల్లలను రక్షించి ప్రభుత్వ హోమ్స్‌లలో షెల్టర్ కల్పించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని వెల్లడించారు. కాగా, త్వరలో సీఎం కేసీఆర్‌కు కమిటీ నివేదిక అందిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకొనేలా నివేదిక ఇవ్వాలన్న మంత్రుల సూచనల మేరకు నివేదిక రూపొందిస్తామని ఆమె పేర్కొన్నారు.న్యూట్రిగార్డెన్‌కు ప్రశంసలు : ఉపసంఘం సమావేశానంతరం మంత్రులు, అధికారులు కలిసి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలో ఉన్న స్టేట్ హోమ్, అకడి విద్యార్థులు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం రసాయనాలు లేకుండా పండించేందుకు ఏర్పాటు చేసిన న్యూట్రి గార్డెన్‌ను సందర్శించి, ప్రశంసించారు. అక్కడి పిల్లలతో మాట్లాడి, అందుతున్న సేవలను ఆరా తీశారు.