తెలంగాణకు తలమానికంగా నిర్మాణమవుతున్న నూతన సచివాలయ నిర్మాణం అత్యద్భుతంగా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం సచివాలయ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. తుది దశకు చేరుకున్న సచివాలయ కాంక్రీట్ పనులను సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించారు.
పనులు జరుగుతున్న తీరుపై మంత్రి వేములతోపాటు రోడ్లు భవనాలశాఖ అధికారులు, వర్క్ ఏజెన్సీ ఇంజినీర్లతో చర్చించారు. కారిడార్లు, గ్రౌండ్ ఫ్లోరు, మొదటి అంతస్థుల్లో కలియదిరుగుతూ పరిశీలించారు. తుది దశ నిర్మాణంలో చేపట్టాల్సిన ఎలివేషన్ తదితర పనులకు సంబంధించి పలు సూచనలిచ్చారు. సెక్రటేరియట్ బాహ్యాలంకరణలో భాగంగా గోడలకు వేసే గ్లాడింగ్ టైల్స్, గ్రానైట్లు, యూపీవీసీ కిటికీలు, అల్యూమినియం ఫ్యాబ్రికేషన్స్, మెట్లకు వేసే గ్రానైట్, ఫ్లోరైడ్ మార్బుల్స్ తదితర నమూనాలను అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు.
వాటి నాణ్యత, కలర్ డిజైన్లను పరిశీలించారు. ఎలివేషన్ ప్రకాశవంతంగా, సుందరంగా కనిపించేలా ఉండాలని సూచించారు. తన వెంట వచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురి అభిప్రాయాలను తెలుసుకొని కొన్ని మోడళ్లను ముఖ్యమంత్రి ఫైనల్‌చేశారు. మోడల్ వాటర్ ఫౌంటెయిన్, ల్యాండ్ సేప్, విశ్రాంతి గదులు, సమావేశ మందిరాలను పరిశీలించారు. సై లాంజ్ నిర్మాణం గురించి సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు.
పనిచేసేందుకు అనువైన వాతావరణం
————————
ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా నిర్మించిన కార్యాలయాలు, విశాలమైన కారిడార్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తంచేశారు. తాను సూచించిన మేరకు నిర్మాణం జరుగుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తంచేశారు. సచివాలయం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఇతర అధికారులను అభినందించారు. సచివాలయాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలన్నారు. నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని, అందులో మంచి అంశాలను స్వీకరించాలని సూచించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు వేముల, సబితతోపాటు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్‌తేజ, ఆర్‌అండ్‌బీ, పోలీసు అధికారులు, నిర్మాణ ఏజెన్సీ షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.