వరి ధాన్యం విషయంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన గడువు దాటిపోయిందని, ఇక ఢిల్లీకి వెళ్లి స్పష్టత తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆదివారం తనతోపాటు వ్యవసాయశాఖ మంత్రి నాయకత్వంలో మంత్రుల బృందం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారుల బృందం ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పా రు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకటిరెండు రోజులు అక్కడే ఉండి, వీలైతే ప్రధానిని కలిసి స్పష్టత తీసుకుంటానన్నారు. రైతులకు స్పష్టత ఇవ్వకపోతే ఆగమైతరని, ఏపంట వేయాలో ఢిల్లీ నుంచి వచ్చాక చెప్తామన్నారు.
ఏడాదికి టార్గెట్ ఇవ్వండి
———————-
ధాన్యం కొనుగోలుపై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం నుంచి సమాధానం రావడం లేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘అన్ని రాష్ర్టాల నుంచి ధా న్యం సేకరించినట్టే తెలంగాణ నుంచి కూడా సేకరిస్తారు కాబట్టి.. ఏడాదికి టార్గెట్ ఇవ్వండి. దాన్నిబట్టి ఇక్కడ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటది.. అని కోరినం. చివరి ప్రయత్నంగా ఆదివారం ఢిల్లీకి మం త్రులు, పార్లమెంట్ సభ్యుల ప్రతినిధి బృందం, అధికారుల బృందంతో వెళుతున్నాం’ అని తెలిపారు.
స్పష్టత ఇవ్వకపోతే ఆగమైతరు
————————
ఈ నెల 19 నుంచి అనూరాధ కార్తె మొదలైందని, పంటలు వేసేందుకు సమయం దగ్గర పడుతున్నందున రైతులకు స్పష్టత ఇవ్వాల్సి ఉన్నదని కేసీఆర్ అన్నారు. ‘రైతులకు ఏదో ఒకటి తేల్చకపోతే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ముందే చెప్తే వేరే పంటైనా వేసుకుంటాం కదా అని రైతులు అడిగే పరిస్థితి వస్తది. ఈ నెల 18న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసిన సమయంలో.. రాష్ట్రంతో ధాన్యం కొనుగోలుపై మాట్లాడి టార్గెట్ నిర్ణయిస్తామని ఒక వార్త, బాయిల్డ్ రైస్ అసలు కొననే కొనం.. యాసంగి వడ్లు అసలే కొనం అని మరికొన్ని వార్తలు వచ్చాయి. అవి అధికారికమా? కాదా? అని తేల్చుకొందామని ఢిల్లీకి వెళ్తున్నాం. ఢిల్లీలో రెండురోజులు పట్టొచ్చు. అక్కడ తెలిసే విషయాలను బట్టి మన రైతాంగానికి స్పష్టత ఇస్తాం’ అని వెల్లడించారు. ‘యాసంగిలో వరి వెయ్యమంటరా? వద్దంటరా? దీనిపై కేంద్రం విధానమేంది? అనేది తెలిస్తే వాళ్లు బీరాలు పలికినరా.. వట్టిగనే చెప్పినరా అన్నది తేలుతుంది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
చివరిగింజ వరకు కొంటం..
———————
ఈ వానకాలంలో పండిన వరిధాన్యం చివరి గింజ వరకు కొంటామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 6,600 పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, అవసరమైతే మరికొన్ని ప్రారంభిస్తామని చెప్పారు. వర్షాలు పడుతున్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరికోతలు ఆపాలని, కోస్తే తడిసి రంగుమారే ప్రమాదముంటుందని చెప్పారు. కోతలు చేపట్టని వాళ్లు రెండురోజులు ఆగాలని కోరారు. కోతలు పూర్తయినవారు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, గతంలో మాదిరే వరిధాన్యం డబ్బులను రైతులకు చెల్లిస్తామని తెలిపారు. ‘కొందరు రాజకీయ బేహారులున్నారు. వారికి తలాలేదు తోకాలేదు. బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నరు. వాళ్లను రైతులే నిలదీస్తున్నరు. చిల్లరగాళ్లు చేసే అసత్య ప్రచారాలను నమ్మకుండా కొనుగోలు కేంద్రాలకు నిదానంగా ధాన్యాన్ని తెచ్చుకోండి’ అని రైతులకు సూచించారు.
బియ్యాన్ని కేంద్రమే సేకరించాలి
————————
దేశ ప్రజలకు ఆహారాన్ని సమకూర్చాల్సిన బాధ్యత ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కేంద్రానిదేనని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశంలో అయితే బియ్యం.. లేకపోతే రొట్టె తింటారన్న కేసీఆర్.. బియ్యం తినే జనాభా కూడా భారీగానే ఉన్నదని, అందుకే కేంద్రం బియ్యాన్ని సేకరిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో పీడీఎస్ కింద 25 లక్షల టన్నుల బియ్యాన్ని మనమే పంచిపెడుతున్నామని గుర్తుచేశారు. ‘గతంలో బియ్యం కొరత ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి సరఫరా చేసేది. 60 లక్షల టన్నుల బియ్యం మన రాష్ట్రంలోనే వినియోగమవుతున్నది. దీంట్లో కేంద్రం చేసేదేమీ లేదు’ అని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు.
కనీస మద్దతు ధర చట్టాన్ని తేవాలి
————————–
దళారులు, వ్యాపారుల చేతిలో రైతులు మోసపోకుండా, పంట వేస్తే ధీమాగా ఉండేలా, కనీస మద్దతు ధర దక్కేలా చట్టాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర చట్టాన్ని దేశంలోని దాదాపు 15 కోట్ల రైతు కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయని, ఈ డిమాండ్ న్యాయమైనది కాబట్టి కేంద్రం వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ చట్టానికి బిల్లు పెట్టాలని కోరారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయంపై టీఆర్‌ఎస్ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు.