దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. కేంద్రం రోజురోజుకూ పెంచుతున్న సెస్సులతో ‘డివైజబుల్ పూల్’ మరింతగా కుంచించుకుపోతున్నదని చెప్పారు. 1980లో కేంద్రానికి పన్నుల రాబడిలో 2.3% మాత్రమే ఉన్న సెస్సులు 2021లో 20 శాతానికి చేరుకున్నాయని తెలిపారు. కొన్నిసార్లు ప్రాథమిక ధరలకంటే ఈ సెస్సులే అధికంగా ఉంటున్నాయని గుర్తుచేస్తూ.. ఈ విపరీత పోకడలను హేతుబద్ధీకరిస్తే పన్నుల పంపిణీ ద్వారా రాష్ట్రాలు మరిన్ని వనరులను సమకూర్చుకోగలుగుతాయని చెప్పారు.
ఆర్థిక ప్రగతిలో రాష్ట్రాలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా కేంద్రం సహకరించాలని కోరారు. దేశ జీడీపీ వృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని, ఇలాంటి రాష్ట్రాల ఆర్థిక బలోపేతానికి కేంద్రం సహకరిస్తే దేశాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రగతిభవన్ నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ వాదనను కేంద్రానికి బలంగా వినిపించారు.
కేవలం ఏడేండ్లలోనే..
————–
‘అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ ఇటీవల ఆర్‌బీఐ ప్రచురించిన నివేదిక ప్రకారం దేశ జీడీపీకి 5% అందిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి రూ.1.24 లక్షలుగా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం కేవలం 7 ఏండ్లలోనే రెండింతలు పెరిగి నేడు రూ.2.37 లక్షలకు చేరింది. 2014లో రూ.5 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ ప్రస్తుతం రూ.9.8 లక్షల కోట్లకు పెరిగింది’ అని వివరించారు. ‘కొవిడ్‌కు ముందు 2018 తొలి త్రైమాసికం నుంచి వరుసగా 8 త్రైమాసికాలపాటు ఆర్థిక వ్యవస్థ మందగించింది. 2011-12లో కేంద్ర పెట్టుబడి జీడీపీలో 39 శాతం ఉండగా.. 2021-22 నాటికి 29.3 శాతానికి తగ్గింది. ఇది దేశ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నది. ఈ నేపథ్యంలో పెట్టుబడి శాతాన్ని పెంచేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు. చైనాలో పెట్టుబడి పెట్టిన ఎన్నో దేశాలు కొవిడ్ అనంతరం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని, ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇప్పటికే కొంత పెరిగినా ఇంకా మెరుగుపరుచుకొనేందుకు మెండుగా అవకాశాలున్నాయని చెప్పారు.
ఎఫ్‌ఆర్బీఎం రుణ పరిమితిని పెంచాలి..
————————-
మూలధన వ్యయ లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలు జీఎస్డీపీలో 0.5 శాతం రుణాలను తీసుకొనేందుకు వెసులుబాటు కల్పించడం స్వాగతనీయమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. క్యాపిటల్ ప్రాజెక్టుల కోసమే రుణాలు తీసుకోవాలన్న కేంద్ర నిర్ణయం అనుసరణీయమేనని చెప్పారు. తదనుగుణంగా ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని 2 శాతానికి పెంచాలని కోరారు. నిబంధనలను సరళీకరించి తెలంగాణ లాంటి రాష్ర్టాలకు కేంద్రం సహకరిస్తే ఇంకా సమర్థవంతంగా పనిచేయగలుగుతాయని, రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతం లభిస్తుందని వివరించారు.
టెక్స్‌టైల్స్, గార్మెంట్స్, టాయ్స్, లెదర్‌గూడ్స్, లైట్ ఇంజినీరింగ్ వస్తువులు, ఫుట్‌వేర్ లాంటి రంగాల్లో పెట్టుబడులకు రాయితీలు కల్పిస్తే తకువ నైపుణ్యమున్న వ్యక్తులకు కూడా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఈ విధానంతోనే చైనా, తూర్పు ఆసియా దేశాలు అద్భుత ఆర్థిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయని, ఇదే మార్గాన్ని భారత్ కూడా అనుసరించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఎంఎస్‌ఎంఈలకూ పీఎల్‌ఐ
——————
దేశ జీడీపీలో 30% వాటా కలిగిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలను (పీఎల్‌ఐ)లను వర్తింపజేయాలని, అంచెలంచెలుగా అభివృద్ధి చెందే సంస్థలకు వడ్డీల్లో రాయితీలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పోటీ నెలకొన్నదని, ఈ సమయంలో ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయి పోటీని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రోత్సహించాలని సూచించారు. బెంగళూరు-హైదరాబాద్ మధ్య ఏర్పడాల్సిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటు చేయడంతో ఆశించిన ఫలితాల సాధనకే మూడేండ్ల ఆలస్యమైందని గుర్తుచేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సామర్థ్యమున్న ప్రాంతాలపై కేంద్రం దృష్టి పెడితే అద్భుత ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇందుకు వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కును చక్కటి ఉదాహరణగా పేర్కొన్నారు.
సావరిన్, పెన్షన్ ఫండ్స్ వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి
—————————
సావరిన్, పెన్షన్ ఫండ్స్‌ను రాష్ర్టాలు మూలధన పెట్టుబడిగా వినియోగించుకొనేందుకు అవకాశమివ్వాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సహకార సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను బలోపేతం చేందుకు అధికార వికేంద్రకరణ చేపట్టాలని కోరారు. ట్యాక్స్ డివల్యూషన్ ద్వారా రాష్ట్రాలకు మరిన్ని నిధులు అందించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు ఇవ్వాల్సిందే
—————————–
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(1) ప్రకారం పారిశ్రామిక అభివృద్ధి కోసం తప్పనిసరిగా పన్ను రాయితీలు అందించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు రెండు విడతలుగా చెల్లించాల్సిన రూ.900 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్‌లకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామిక కారిడార్లు మంజూరు చేయండి
——————————
రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టులను ఇప్పుడు నిలిపేశారని, 6 పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పదే పదే అడిగినా మంజూరు చేయలేదని మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలకు సంబంధించి తెలంగాణలో అద్భుతమైన ఎకోసిస్టమ్ ఉన్నందున ఇప్పటికైనా 6 పారిశ్రామిక కారిడార్లను మంజూరు చేయాలని కోరారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు ఫ్యాక్టరీ పేపర్లకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న పదేండ్లలో భారీగా ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలున్న టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, లైఫ్ సైన్సెస్ రంగాలను ప్రోత్సహించాలని సూచించారు.