కరోనా సంక్షోభంతో ప్రపంచమంతటా ఆర్థిక పరిస్థితులు తారుమారైనప్పటికీ తెలంగాణ మాత్రం స్థిరమైన వృద్ధిరేటుతో దూసుకెళ్తున్నది. వ్యవసాయం, తయారీ, విద్యుత్తు, నిర్మాణం తదితర రంగాల్లో తెలంగాణ.. దేశ సగటు కంటే ఎంతో బలమైన వృద్ధిరేటుతో మరింత ముందుకు పయనిస్తున్నదని కొవిడ్ అనంతర పరిణామాలపై రూపొందించిన నివేదికలో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వెల్లడించింది. కరోనా కాటుతో దాదాపు అన్ని దేశాలూ కుదేలయ్యాయి. పారిశ్రామికం సహా పలు రంగాలకు ఈ మహమ్మారి అనేక గుణపాఠాలు నేర్పిందని సీఐఐ నివేదిక పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఆయా రంగాలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని, ముఖ్యంగా డిజిటలైజేషన్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరమున్నదని స్పష్టం చేసింది. మానవ వనరుల సమస్యను అధిగమించేందుకు ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని, దిగుమతులపై ఆధారపడకుండా సొంతంగా వస్తువుల ఉత్పత్తిని పెంచుకోవాలని తెలిపింది.
ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ద్వారా పారిశ్రామికరంగాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని పేర్కొన్నది. ప్రభుత్వం అవలంబిస్తున్న పారిశ్రామిక, వ్యాపార అనుకూల వి ధానాలు, భౌగోళికంగా రాష్ర్టానికి ఉన్న సానుకూలతలు తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు దోహదపడతాయని నివేదిక తెలిపింది.
సీఐఐ నివేదికలోని ముఖ్యాంశాలు
———————-
★ ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ రూ.9.69 లక్షల కోట్లుగా ఉన్నట్టు అం చనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.5 శాతంగా, తెలంగాణ వృద్ధిరేటు 12.6 శాతం. దేశ ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ వాటా ఎంతో అధికమని స్పష్టంచేసింది.
★ దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2018-19లో 4.38 శాతంగా, 2019-20లో 4.52 శాతంగా నమోదైనట్టు తెలిపింది. దేశంతో పోల్చుకుంటే రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల సూచీ (ఫైనాన్షియల్ కండిషన్స్ ఇండెక్స్- ఎఫ్‌సీఐ) కూడా గణనీయంగా పెరిగిందని, 2018-19, 2019-20 మధ్య కాలంలో రాష్ట్ర ఎఫ్‌సీఐ 11.6 శాతంగా, దేశ ఎఫ్‌సీఐ 6.3 శాతంగా ఉన్నదని వెల్లడించింది.
★ దేశంలో అత్యంత ప్రధానమైన వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి 2020-21లో తెలంగాణ జీఎస్‌వీఏ (గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధిరేటు 15.8 శాతంగా, జాతీయ వృద్ధిరేటు కేవలం 10.1 శాతంగా నమోదైనట్టు తెలిపింది.2020-21లో తెలంగాణ తయారీ, నిర్మాణ, విద్యుత్తు తదితర రంగాల్లో సైతం 5.3 శాతం వృద్ధిరేటు నమోదైందని, ఇదే సమయంలో దేశ వృద్ధిరేటు 2.5 శాతమేనని పేర్కొన్నది.
★ పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్ లాంటి వినూత్న విధానాలను అవలంబించడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో తెలంగాణ గత మూడేండ్ల నుంచి వరుసగా మూడో స్థానంలో కొనసాగుతున్నదని, ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డీజీ) భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విధమైన సులభతర విధానాలను చేపట్టిందని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు
—————-
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, పరిశోధనలు, నాణ్యమైన జీవనం తదితర అంశాల్లో మరిం త మెరుగైన స్థితికి చేరుకొనేందుకు రానున్న 10 ఏండ్లలో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్)ను 20 శాతానికి పెంచుకోవాలని రాష్ట్ర ప్ర భుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇన్వెస్ట్ ఇండియా పాలసీ, నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ తరహాలో ఎలక్ట్రానిక్స్, హై-టెక్ మాన్యుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆర్‌అండ్‌డీ, ఇతర సేవా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా వచ్చే పదేండ్లలో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్దేశించుకొన్నది.
ప్రత్యేక పాలసీలు, ప్రోత్సాహకాలతో డిజిటలైజేషన్‌ను పెంపొందించడం ద్వారా మరింత వృద్ధిని సాధించేందుకు 14 రంగాలను గుర్తించింది. వీటిలో బయోసైన్సెస్, ఎఫ్‌ఎంసీజీ అండ్ డొమెస్టిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్, ఇంజినీరింగ్ అండ్ క్యాపిటల్ గూడ్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, జెమ్స్ అండ్ జ్యూయలరీ, ఫుడ్ ప్రాసెసింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్, ఆటోమొబైల్స్, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం, టెక్స్‌టైల్, మినరల్స్ అండ్ ఉడ్, ప్లాస్టిక్స్ అండ్ పాలీమర్స్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ తదితర రంగాలు ఉన్నాయి.
దిగుమతులపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడటం నేర్పింది
——————————–
దిగుమతులపై ఆధారపడకుండా సొంతంగా వస్తువులను ఉత్పత్తి చేసుకోవాల్సిన ఆవశ్యకతను కొవిడ్ సంక్షోభ సమయం చాటి చెప్పింది. స్వయం శక్తితో ఎదిగి, ప్రపంచ స్థాయి సంస్థలకు పోటీ ఇచ్చేందుకు ఇది తోడ్పడుతుంది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా ఆధునిక పద్ధతులను అనుసరించేందుకు, సైప్లె చెయిన్‌ను పెంచుకునేందుకు వీలుకలిగింది. అత్యుత్తమ విధానాలను అవలంబించడం, ఎరువుల వినియోగం ద్వారా హరితవిప్లవం సంభవించింది.
ఇదే తరహాలో డిజిటల్ సాంకేతికత ద్వారా ఉత్పాదక రంగాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర, సానుకూల విధానాల వల్ల తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. భౌగోళికంగా కూడా తెలంగాణకు అనేక అనుకూలతలు ఉండటంతో పెట్టుబడులకు రాష్ట్రం దేశంలోనే ప్రధాన గమ్యస్థానంగా మారింది. అందుకే ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ర్టాల కంటే ఎంతో జోరుగా ముందుకు సాగుతున్నది.
– సమీర్ గోయల్, చైర్మన్, సీఐఐ – తెలంగాణ.