ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సందర్భంగా హీరోయిన్ సంధ్యారాజు నాట్యం సినిమా గురించి చెప్పిన విశేషాలు…
చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం. ప్రతీ రోజూ నాకు నాట్యం గురించి ఆలోచనలే ఉంటాయి. సినిమా ద్వారా ఇంకా దగ్గరకు రావొచ్చనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను. నాట్య ప్రదర్శనలు చేస్తే ఎప్పుడూ ఒకే సెక్షన్ పీపుల్స్ చూస్తుంటారు. కానీ ఒక్క షార్ట్ ఫిల్మ్ ద్వారానే నాట్యం గురించి ఎంతో మందికి చెప్పాం. చాలా రీచ్ అయింది. అప్పుడు సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏంటో అర్థమైంది. అందుకే ఈ సినిమాను తీశాను.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ సినిమాను చూశారు. అభినందించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఐదు నిమిషాలే సినిమా చూస్తాను అని అన్నారు. కానీ సినిమా మొదలైన తరువాత.. పూర్తయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు. ఆ తరువాత నన్ను సత్కరించారు.
చిరంజీవి గారు ఇంకా మా సినిమా చూడలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి కాకుండా.. వ్యాపార రంగం నుంచి నేను రావడం, ఇలా సినిమా తీయడం, నటించడం ఆయనకు బాగా నచ్చింది. మా టీజర్ ఆయన చూశారు. బాగా నచ్చింది. మమ్మల్ని ప్రశంసించారు.