విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి కోసం పౌష్టికాహార ప్రణాళికను అమలు చేస్తూ, వారికి మంచి ఆరోగ్యం, భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఈరోజు అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాట సింగారం మహాత్మ జ్యోతిబాపూలే సాంఘిక సమీకృత బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన యూనిఫామ్ డైట్ లాంచ్ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి, ఎస్ఓపీ హ్యాండ్ బుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మంచి భోజన సదుపాయాలు అందించేందుకు ముఖ్యమంత్రి ఎనిమిది సంవత్సరాల తర్వాత విద్యార్థి డైట్ చార్జీలను 40 శాతం పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు తెలిపారు. విద్యార్థులుబలంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం అవసరమని అన్నారు. విత్తనం కష్టాలను ఎదుర్కొని బలంగా చెట్టు ఎదిగినట్లుగా, మీరు కూడా కష్టాలను తట్టుకుని గొప్ప స్థాయికి ఎదగాలని అన్నారు.
మంచి పౌష్టిక ఆహారం, ఆరోగ్యం బాగుండాలని ఉద్దేశంతో ప్రభుత్వం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. చిన్న వయసులోనే మంచి ఆహారం తీసుకుంటూ భవిష్యత్తులో గొప్ప స్థాయిలలోకి చేరి, మంచి ఆఫీసర్లుగా ఎదగాలని విద్యార్థులకు అయన సూచించారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతి ఆహార ప్రణాళిక ద్వారా విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ, వారి ఆరోగ్యం కోసం ప్రతి విద్యార్థికి నెల డైట్ ఖర్చును పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా వెనకబడి ఉన్న వర్గాలకు పౌష్టికాహారం అందించి, వారు మంచి విద్యను అభ్యసించి తమ భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఇస్తోందని అన్నారు.
విద్యార్థులు డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే ప్రతి రోజూ పాఠశాలకు హాజరై, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ వంద శాతం అటెండెన్స్‌తో కష్టపడి చదువుకోవాలని అన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు పదవ తరగతి పరీక్షలలో 10/10 జీపీఏ సాధించేందుకు కష్టపడి ఇష్టంగా చదవాలని అన్నారు. సాయంత్రం 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని, తల్లిదండ్రులు చదువు ఎంత ముఖ్యం అనే విషయాన్ని గుర్తించి, తమ పిల్లలను పాఠశాలలకు పంపించి, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.