* కరోనా వేళ రంధ్రాన్వేషణ చేస్తున్న చంద్రబాబుకు, టీడీపీకి పుట్టగతులుండవ్ః అంబటి రాంబాంబు ఫైర్
* వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ అంబటి రాంబాబు కామెంట్స్..
* చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా ఎల్లో మీడియాలో కథనాలా…?
* ఇది మానవ చరిత్రలోనే మహా విపత్తు.. సహాయం చేయకపోయినా, రాళ్ళు వేయెద్దు
* కరోనా వేళ మానవత్వం చూపకపోయినా.. కనీసం మనుషులుగా స్పందించండి
* వ్యాక్సిన్ సరఫరా చేస్తే.. వారం, పదిరోజుల్లోనే వ్యాక్సినేషన్ పూర్తిచేసే సత్తా ఒక్క ఏపీ ప్రభుత్వానికే ఉంది
1. మానవ చరిత్రలోనే మహా విపత్తు ఇది. వందేళ్ళక్రితం వచ్చిన ఫ్లూ జ్వరం తరవాత అతి పెద్ద సవాలు విసురుతోంది. ఇది మానవ జాతి మీద వైరస్ చేస్తున్న యుద్ధం. కనిపించని శత్రువు మీద అందరం కలిసి పోరాటం చేస్తున్నాం. ఎవరికి వారుగా, కుటుంబంగా, సమాజంగా, రాష్ట్రంగా, దేశంగా, మొత్తం ప్రపంచంగా యుద్ధం చేస్తున్న పరిస్థితి. ఈరోజు చాలా దురదృష్టకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం.
– ఒక తుపాను వస్తే.. ప్రకృతి వైపరీత్యాలు వస్తే.. అందరం కలిసి ఎదుర్కొంటాం. దివిసీమ ఉప్పెన నుంచి సునామీలు, భూకంపాలు.. వచ్చినా ఆ సమయంలో మానవత్వాన్ని చాటుకునేందుకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అంతా కలిసి పనిచేసిన సందర్భాలు చూశాం. ప్రకృతి వైపరీత్యాలకంటే ఇది చాలా పెద్ద విపత్తు. ప్రపంచమంతా ఈరోజు కరోనాతో యుద్ధం చేస్తోంది.
– రామకృష్ణా మిషన్, సత్యసాయి పౌండేషన్.. ఇలా అనేక స్వచ్ఛంద సంస్థలు, చలన చిత్ర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు.. అంతా గతంలో సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. సాయం చేయలేని వారు మౌనంగా కూర్చుంటున్నారు.
– దురదృష్టం ఏమిటంటే.. ఇంత విపత్తు సమయంలో సాయం చేయకపోయినా పరవాలేదుకానీ, కొందరు ఇదే అదనుగా ప్రభుత్వం మీద దాడి చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం చేస్తున్నారు.
– ప్రపంచంలో, దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. వీటిని చూస్తే.. కంటి వెంట కన్నీరు కాదు.. రక్తం కారే పరిస్థితి.
– ఈ పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం, చంద్రబాబు లాంటి వారికి స్వార్థ రాజకీయమే కావాలి. ప్రభుత్వంపై పదే పదే బురదచల్లాలనుకోవడం దురదృష్టకరం.
2. తెలుగుదేశం, దానికి అనుకూలమైన పార్టీలు, వారికి అనుకూలమైన మీడియాలు శ్మశానాల్లో కెమెరాలు పెట్టడం, ఎక్కడైనా ఏ ఒక్క రోగికి చిన్న ఇబ్బంది ఏర్పడితే, దానిని భూతద్దంలో పదే పదే చూపిస్తున్నాయి. ఎవరికైనా కష్టం వస్తే.. దానిని మీడియాలో చూపించవచ్చు తప్పులేదుకానీ, దాన్నే పదే పదే చూపించి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం కరెక్టు కాదు.
– చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సమాజం అంతా ఐక్యంగా ఉండాలని, శ్రమదానాలు చేయాలని, చెరువుల్లో పూడికలు తీయాలని, ఊళ్ళల్లో పనులు ఎవరికి వారే చేసుకోవాలని ఇవే మీడియా సంస్థలు పెద్దఎత్తున ప్రచారం చేశాయి.
– ఈరోజు ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా పనిచేస్తున్నా, ఎక్కడైనా ఏదైనా చిన్న ఘటన జరిగితే దానిని భూతద్దంలో చూపించడం, సమాజంలో మంటలు పెట్టాలని చూడటం, తమ కులం వాడు అధికారంలో లేడు కాబట్టి ప్రభుత్వం మంచి చేస్తున్నా, విమర్శించడమే పనిగా పెట్టుకోవాలని చూడటం పరమ దుర్మార్గమైన చర్య.
– చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరొకలా టీడీపీ అనుకూల మీడియా వ్యవహరించడం సిగ్గుచేటు.
– చంద్రబాబు అధికారంలో ఉంటే, ప్రజలంతా దాతృత్వం చూపించాలని.. చంద్రబాబు దిగిపోతే మా చంద్రబాబును దింపేస్తారా అంటూ మంచి చేస్తున్న ప్రభుత్వంపై కూడా అమానుషంగా దాడి చేసే రాక్షస జర్నలిజాన్ని ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం.
3. కరోనా లాంటి వైరస్ ను ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన సమయంలో, శవాల గుట్టలని, స్మశానానికి రాజులని రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటు.
– ఈరోజు దేశంలో కోవిడ్ సగటు రికవరీ రేటు 82.5 శాతం ఉంటే… మన రాష్ట్రంలో 92.53 శాతం ఉంది. అంటే కోలుకున్న వారి శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. దీనికి కారణం ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రభుత్వం చేస్తున్న పనులే. దీన్ని ఎవరైనా కాదనగలరా..?
– ఉన్న వాస్తవాన్ని టీడీపీ అనుకూల మీడియాలో చూపించకపోయినా, రాయకపోయినా, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత అధికారపక్షంగా మాపై ఉంది.
– టెస్టుల విషయంలోనూ.. పర్ మిలియన్ టెస్టుల్లో దేశంలోనే మొదటి స్థానంలో మన రాష్ట్రం ఉంది.
– 104 వ్యవస్థను పటిష్టం చేసి, 24 గంటలూ సేవలు అందిస్తున్నాం.
– వ్యాక్సినేషన్ విషయంలో.. దేశం మొత్తం మీద మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారు 12 కోట్లు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 50 లక్షల మందికి పైగా తీసుకున్నారు.
– జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూతనంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే ఇది సాధ్యమైంది.
4. ఏ సంక్షేమ పథకాన్ని అయినా శాచురేషన్ ప్రాతిపదికన ఇచ్చే ఈ ప్రభుత్వంలో.. కావాల్సిన వ్యాక్సిన్ లు అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటే.. మొత్తం వారం, పది రోజుల్లోనే రాష్ట్రంలోని పౌరులందరికీ వ్యాక్సిన్ లు ఇవ్వడం సాధ్యమవుతుంది.
– వ్యాక్సిన్ లు, రెమిడిసివర్ ఇంజక్షన్లు తయారీ సంస్థలు ఎవరి చేతుల్లో ఉన్నాయి. పత్రికాధిపతుల బంధువుల సంస్థలే ఈ వ్యాక్సిన్ లు తయారు చేస్తున్నాయి. అవి తయారు చేయగలిగితే, మనకు ఇవ్వగలిగితే, వెంటనే ప్రజలకు అందించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవన్నీకేంద్రం చేతిలో ఉన్నా.. సమర్థవంతంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్ కోవిడ్ పై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ.. త్వరగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని తాపత్రయపడుతున్నారు.
– వ్యాక్సిన్ సరఫరా చేస్తే.. రాష్ట్రంలోని పౌరులందరికీ కేవలం పది రోజుల్లోనే పూర్తి చేయగల వ్యవస్థ ఒక్క ఏపీలోనే ఉంది.
5. జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని రకరకాలుగా టార్గెట్ చేస్తున్నారు.
– మొదట ఆలయాలు, విగ్రహాలపై టార్గెట్ చేశారు. దానికి కారణం పంచాయతీ, జెడ్ పీటీసీ, తిరుపతి ఎన్నికలు. ఏ ఎన్నికల్ని చూసినా ప్రజలు తెలుగుదేశం, దాని తోక పార్టీలను తిరస్కరించారు.
– అన్ని ఎన్నికల్లో ప్రజలు వైయస్ఆర్సీపీ పక్షాన నిలిచారు.
-వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను రెచ్చగొట్టారు.
– ఆతర్వాత కార్మిక సంఘాలు, ఉద్యోగులు, రైతులు, వివిధ వృత్తుల వారిపై సానుభూతి డ్రామాలు ఆడుతూ.. హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు జూమ్ మీటింగ్ ల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా ఆయా వర్గాలకు ఈ ప్రభుత్వంపై విశ్వాసం చెక్కుచెదరదు అని తాజా ఎన్నికల్లో నిరూపించారు.
6. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కేవలం రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు.
– రాష్ట్రంలో 25.8 శాతం కరోనా పాజిటివిటీ రేటు ఉందని చంద్రబాబు తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి.. ప్రభుత్వ లెక్కల ప్రకారం కరోనా పాజిటివిటీ రేటు 6.59 శాతం మాత్రమే ఉంది.
7. ఇజ్రాయిల్ లాంటి తక్కువ జనాభా ఉన్న దేశాల్లో, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుంది. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే సహజంగానే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తనకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు దానినికూడా అర్థం చేసుకోకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దాడి చేయడం నీచం.
8. ఇప్పటికైనా మానవత్వం ఉన్న మనుషులుగా వ్యవహరించండి. కోవిడ్ వచ్చిన తర్వాత టీడీపీ, దాని అనుకూల మీడియా, దాని అనుకూల పార్టీలు పోషించిన పాత్ర ఏమిటో వారే ఆత్మ విమర్శ చేసుకోవాలి. సమాజంలో, ప్రజల్లో, ప్రతి ఒక్కరిలో ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలు చేపడుతున్నారు.
– మేం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల మనోధైర్యాన్ని పెంచటానికి ఏ రోజైనా కృషి చేశారా.. లేక వారి భావోద్వేగాలతో ఆడుకోవడానికి మీరు పనిచేశారా..?
9. ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజులోనే కోవిడ్ వ్యాక్సిన్ ను 6 లక్షల మందికి ఇచ్చిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే. మీరు వ్యాక్సిన్ సరఫరా చేస్తే.. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉంది.
10. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టడం మంచి పద్ధతి కాదు. దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మానవత్వంతో వ్యవహరించడం నేర్చుకోండి. ఈ విషమ పరిస్థితుల్లో ఉద్యోగుల్ని, ప్రజల్ని రెచ్చగొడితే మీరే తగిన మూల్యం చెల్లించుకుంటారు, గుర్తుంచుకోండి.
11. రాష్ట్రంలో శవాలు గుట్టలుగా ఉన్నాయని చంద్రబాబు ఎవర్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు..
– కోవిడ్ మరణాలు సంభవిస్తే.. అవి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే సంభవిస్తున్నాయా..?
– మొన్నటి వరకూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎన్నికలు ఈ పరిస్థితుల్లో వద్దని చెబితే విన్నారా.. ?
– ఎన్నికల వల్లే ఈ ఉద్ధృతి వచ్చింది. దీనికి బాధ్యులు ఎవరు..?, మీరు కాదా..
– పంచాయితీ, జెడ్ పీటీ సీ ఎన్నికల వల్లే ఈ పరిస్థితి అని మేం చెప్పవచ్చు. కానీ అది బాధ్యతా రాహిత్యం అవుతుంది.
– నిమ్మగడ్డ అంటే ఎవరో కాదు, ఆయనలో పరకాయ ప్రవేశం చేసిన చంద్రబాబే కదా దీనికి బాధ్యుడు..!
– చంద్రబాబు తన తప్పులు పక్కన పెట్టి.. బొక్కలు వెతికే కార్యక్రమం, రంధ్రాన్వేషణ చేసే కార్యక్రమాలు చేయడం సమంజసం కాదు. ఇప్పటికే చంద్రబాబు, ఆయన పార్టీ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
– ఇంకా చంద్రబాబు అనుకూల మీడియా, ఆయన మనుషులు, తమ ప్రభుత్వం, తమ కులం ప్రభుత్వం లేదన్నట్టుగా దురదృష్టకరమైన విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేయడానికి ఇది సమయం కాదు. అందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇది.
12. ఒకవైపు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కోవిడ్ తో పోరాడుతున్నారు. వారి ఆత్మ స్థైర్యం దెబ్బతీయవద్దు. ఇప్పటికైనా, జాగ్రత్తగా రాజకీయాలు చేయకపోతే.. భవిష్యత్తులో చంద్రబాబుకు, టీడీపీ, దాని అనుకూల పార్టీలకు పుట్టగతులు ఉండవు.