వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు
అది టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కాదు.. అంతర్థాన దినం.
అందుకే సూర్యాస్తమయ సమయంలో వేడుక నిర్వహించారు.
చంద్రబాబు హయాంలోనే తెలుగుదేశం పార్టీ కనుమరుగు.
ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదు. చంద్రబాబు సీఎం కాడు.
వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టీకరణ.
చంద్రబాబు హయాంలో దేశంలోనే అత్యధికంగా అప్పులు.
వాస్తవాలు వక్రీకరిççస్తూ ఎల్లో మీడియా రాతలు. దుష్ప్రచారం.
ప్రతి పైసాకు ప్రభుత్వం జవాబుదారీ. అభివృద్ధి కోసమే ఖర్చు.
దీన్ని ప్రజలు గుర్తించారు. అందుకే స్థానిక ఎన్నికల్లో గెలుపు.
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ద్రోహం చేశాడు.
హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు.
ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. దాన్ని ఆపబోము.
ప్రెస్‌మీట్‌లో వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే అంబటి.
అంతర్ధాన దినం :
‘టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అనాలో లేక అంతర్థాన దినోత్సవం అనాలో తెలియదు కానీ, ఆ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు యథావిథిగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీని 1982, మార్చి 29న నాటి మహా నటుడు ఎన్టీ రామారావు ప్రారంభించారు. ఆ పార్టీ అనూహ్యంగా, అందరినీ ఆశ్చర్య పరుస్తూ 9 నెలల్లోనే రాజకీయ శక్తిగా ఎదిగి తిరుగులేని పరిపాలన చేసింది. ఆ పార్టీని ఎన్టీ రామారావు స్థాపిస్తే, ఆ పార్టీని చీమల పుట్టలో పాములు చేరినట్లు, ఆ పార్టీని ఒక విషసర్పంలా చంద్రబాబు ఆక్రమించుకున్నాడు. నిన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ వాతావరణం, పరిస్థితి చూస్తే అది అంతర్థాన దినంగా అనిపించింది. ఎక్కడైనా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సూర్యాస్తమయ సమయంలో చేశాడు. అంటే ఆ పార్టీ అంతరించి పోతుంది. తిరిగి ఆ పార్టీ బతికే పరిస్థితి లేదు. గతంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు చాలా «ఘనంగా జరిగేవి. కానీ నిన్న చాలా పేలవంగా, నిస్తేజంగా జరిగింది’.
కొడిగట్టే పరిస్థితిలో.. :
‘ఎన్టీ రామారావు పార్టీ పెట్టి, ప్రజల్లో తిరిగినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? కానీ నిన్న ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్‌ను గుర్తు చేయడం ఆశ్చర్యం కలిగించింది.
ఇప్పుడు ఆ పార్టీ కొడిగట్టే పరిస్థితిలో ఉంది. ఆ పార్టీకి కనీసం పోటీ చేసే అభ్యర్థులు కూడా దొరకడం లేదు. వామపక్షాల మాదిరిగా టీడీపీ కూడా క్రమంగా బలహీనపడిపోయింది’.
అందుకే శిధిలావస్థకు! :
‘ఎన్టీఆర్ గారు ఒక రాజకీయ శక్తిగా ఎదిగిన పార్టీని స్థాపించారు. నిజానికి ఆయన వారసులకు ఆ పార్టీ పగ్గాలు అంది ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఒక మ్యానిప్యులేటర్ చేతిలో పార్టీ పడింది కాబట్టే, ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఎన్టీఆర్ వారసులకు పౌరుషం లేదు. చంద్రబాబు తన కుమారుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న అత్యాశతో పని చేశారు. అందుకే ఈ పార్టీ శిధిలావస్థకు చేరింది’.
ప్రజలు ఇచ్చారు.. :
‘నిన్న మాపై చంద్రబాబు చాలా విమర్శలు చేశారు. వాటిలో కొన్నింటికి మేము సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం ఆదాయానికి మించి అప్పులు చేస్తోందని, ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. మీకు ఎవరు అధికారం ఇచ్చారో, ఆ ప్రజలే ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. 5 ఏళ్లు పరిపాలించడానికి ప్రజలు అధికారం ఇచ్చారు’.
నాడు 132 శాతం! :
‘ఈ 11 నెలల్లో ప్రభుత్వం రూ. 79,191 కోట్లు అప్పులు చేసిందని, అది 63 శాతం ఎక్కువని ఈనాడు రాసింది. దాన్నే చంద్రబాబు ప్రస్తావించారు. మరి చంద్రబాబు నాయుడు తన హయాంలో అంతులేని అప్పులు చేశాడు. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్లలో కేంద్ర అప్పులు 49.9 శాతం అప్పులు పెరిగితే ఇక్కడ చంద్రబాబు పాలనలో 132.31 శాతం అప్పులు పెరిగాయి. అది ఎల్లో మీడియాకు కనిపించలేదా?’.
ఏదీ ఆగలేదు :
‘ఇవాళ సీఎం గారు అప్పులు చేశారు, కానీ ఎవరి కోసం? కరోనాతో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అయినా ఎక్కడా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఆపలేదు. అందుకే అప్పులు చేయాల్సి వచ్చింది. నిజానికి ఆర్థికంగా దేశంలో కూడా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ప్రతి పైసాకు ఈ ప్రభుత్వం జవాబుదారీగా నిలబడింది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అంతే తప్ప, చంద్రబాబు హయాంలో మాదిరిగా కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోలేదు. ఇక్కడ ప్రతి పైసాకు ప్రభుత్వం జవాబుదారిగా ఉంది. అయినా ఎల్లో మీడియా ఏదేదో రాస్తోంది’.
ప్రజలు గుర్తించారు. అందుకే.. :
‘అప్పు చేసి తెచ్చిన ప్రతి పైసాను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేసి, వారి అభివృద్ధి కోసం పాటు పడడం తప్ప, మీలాగ అప్పు చేసి ఆర్భాట ప్రచారాలు చేయడం, పప్పు కూడు తిన్న ప్రభుత్వం మాదిరిగా కాదు. ఈ ప్రభుత్వం అలాంటిది కాదు. దీన్ని మీరు గమనించకపోయినా ప్రజలు గుర్తించారు. అందుకే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. అయినా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు’.
మీకు ఆ హక్కు లేదు :
‘ఇవాళ చంద్రబాబునాయుడు గారు ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా తెస్తామన్నారు కదా? మరి ఎందుకు తేలేదు? అని మమ్మల్ని అడుగుతున్నారు. ఒక్క విషయం చంద్రబాబు గారు, ప్రత్యేక హోదా అన్న పదం కూడా ఉచ్ఛరించే నైతిక హక్కు మీకు లేదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో 5 ఏళ్లు కలిసి పని చేసిన, అధికారం పంచుకున్న ప్రభుత్వం మీది. పార్టీ మీది. ఆరోజు మీరేమన్నారు?. విభజన చట్టంలో అనేక అంశాలతో పాటు, ప్రత్యేక హోదా అన్న అంశం కూడా ఉంటే మీరేమన్నారు?. ప్రత్యేక హోదా ఎందుకు?. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రాన్ని బ్రతికిస్తుందా?. ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండంగా బ్రతికిస్తుందని సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేసి, ప్రత్యేక హోదా అన్న అంశాన్ని నిట్టనిలువుగా ముంచిన మోసగాడివి నువ్వు కాదా? చంద్రబాబునాయుడు అని అడుగుతున్నాను. అందుకే ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని మనవి చేస్తున్నాను’.
మా ప్రయత్నం ఆగదు :
‘ఆరోజే కాదు ఇవాళ్టికి కూడా మేము మనవి చేస్తూనే ఉన్నాం. ప్రత్యేక హోదానే ఈ రాష్ట్రాన్ని ఒక పద్ధతిగా ముందుకు తీసుకుపోతుందని నమ్ముతున్నాం. దాని కోసం పోరాడుతూనే ఉంటాం. అడుగుతూనే ఉంటాం. ప్రయత్నం చేస్తూనే ఉంటామని దయచేసి గుర్తు పెట్టుకోండి.
ఆరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ మీ సపోర్టుతో అధికారంలోకి వస్తే, దాంతో రాజీ పడిపోయి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని ఈ రాష్ట్రానికి దారుణమైన మోసం చేసిన నువ్వు.. ఇవాళ మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు. ప్రజలకు మేము సమాధానంగా ఉంటాం. ప్రత్యేక హోదా గురించి మేము ఎప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉంటాం. తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రత్యేక హోదాను తేవడానికి పని చేస్తూనే ఉంటాం’.
ఆ మాత్రం తెలియదా? :
‘ఇవాళ నెంబర్ల గేమ్ మీకు తెలియదా?. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉందని చెబుతావు. ఇవాళ నెంబరు గేమ్‌లో.. భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ రావడం వల్ల వారికి మా మద్దతు అవసరం లేకపోవడం వల్ల, వారి మెడలు మనం ఒంచలేకపోతున్న సందర్భాలు ఉన్నాయి. అయినా సమయం కోసం చూస్తాం. అన్ని ప్రయత్నాలు చేస్తాం తప్ప, మీలాగ ప్రజలను మోసం చేసే తత్వంతో మేము లేమని చెప్పి గుర్తించండి’.
అది కల మాత్రమే :
‘ఇంకా చంద్రబాబునాయుడు గారు చాలా విషయాలు మాట్లాడారు. ఇంకో మాట కూడా అన్నాడు. తమ్ముళ్లూ భయపడకండి. వచ్చేది మనమే.. ఎక్కడికి వస్తాడు?. ఎక్కడికొస్తారండి మీరు?. ఈ రాష్ట్రంలో మీరు తిరిగి అధికారంలోకి వచ్చేది కల మాత్రమే. అయినా ప్రజలను, మీ కార్యకర్తలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఒకటే మనవి చేస్తున్నాను. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టు మహావృక్షమట. అలా మీరు ఈ రాష్ట్రంలో వెలుగొందారు. కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకుడు లేకపోవడం వల్ల మీరు ముఖ్యమంత్రిగా చలాయించారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఎదిగి వచ్చిన తర్వాత, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మూలన కూర్చున్నారు. మర్చిపోయారా?’.
‘దురదృష్టవశాత్తూ రాజశేఖర్‌రెడ్డిగారు చనిపోవడం వల్ల, జగన్‌మోహన్‌రెడ్డి గారి మీద కేసులు పెట్టి, అనేక హింసలు చేయడం వల్ల మీరు అధికారంలోకి వచ్చారు. మీరు మళ్లా అధికారంలోకి ఈ రాష్ట్రంలో రావడం అనేది మీకు, తెలుగుదేశం పార్టీకి కేవలం కల మాత్రమే అని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను’.
ప్రజా నాయకుడు వచ్చాడు :
‘ఒక సమర్థవంతమైన నాయకుడు, ఒక ప్రజా నాయకుడు, ఒక రీజినల్ ఫోర్స్ ఈ రాష్ట్రంలో ఎమర్జ్ అయింది. మీకన్నా బలవంతమైన, శక్తివంతమైన రాజకీయ పార్టీ. అనేక సంక్షేమ కార్యక్రమాలు. చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీ ప్రారంభమైన తర్వాత, ఈ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్‌మోహన్‌రెడ్డి గారి చక్కని పాలన చూసిన తర్వాత, ఈ తెలుగుదేశం పార్టీకి, ప్రతిపక్షాలకు నూకలు చెల్లాయని గుర్తు పెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి రావడం అనేది నువ్వు, నీ పార్టీకి కల అన్నది మర్చిపోకండి’.
తమ్ముళ్లూ నమ్మకండి :
‘తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. తమ్ముళ్లూ నమ్మమాకండి. చంద్రబాబునాయుడు గారు మళ్లీ అధికారంలోకి వస్తాడని, ఆయన ఏదో చేస్తాడని, ఎదురు చూసి మోసపోకండి. మీ పని మీరు చేసుకోండి. మీ మార్గాలు మీరు వెతుక్కోండి తప్ప, చంద్రబాబునాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. నేను ఒక్కటి మనవి చేస్తున్నాను. చంద్రబాబునాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన ఆఫీసులు కట్టారు. హైదరాబాద్‌లో ఉంది. మంగళగిరిలో కూడా ఉంది. వాటన్నింటిలో హెరిటేజ్ మాల్స్ పెట్టుకోవాలి తప్ప, వాటితో వేరే పనేమీ ఉండదని మనవి చేస్తున్నాను. ఎక్కడ చూసినా పార్టీ ఆఫీసులు బ్రహ్మాండంగా కట్టారు. వాటన్నింటినీ హెరిటేజ్ మాల్స్‌గా మార్చుకోవడం తప్ప, రాష్ట్రంలో మీరు తిరిగి అధికారంలోకి రావడం, మీరు ముఖ్యమంత్రి కావడం అన్నది జరిగేది కాదని గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నాను’.
ఎవరి సంపద పెంచారు? :
‘చంద్రబాబు మొన్న ఇంకో మాట కూడా అన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలను రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాలని అనుకున్నాడట. నాకు అర్ధం కాదు. నిజానికి అమరావతిని, పోలవరాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకుని దోచుకున్నారు తప్ప, రాష్ట్రాభివృద్ధి కోసం పని చేశారా చెప్పండి?. నిన్న అంటున్నాడు.. అమరావతిలో అట, లక్ష కోట్ల నుంచి రెండు లక్షల కోట్లు ఆదాయం వచ్చేలా సంపద పెంచారంట!. అది జాతీయ సంపద అట!. ఎవరికండీ?. ఎవరి జాతి సంపద?. మీ జాతి సంపదా?. లేక తెలుగు జాతి సంపదా?’.
ప్రభుత్వమా? రియల్ వ్యాపారమా? :
‘మొత్తం మీ వర్గానికి దోచి పెట్టాలన్న ఉద్దేశంతో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేశారు. ఆ అమరావతిని ఇవాళ మేము సర్వ నాశనం చేశామంటున్నారు. నాకు అర్ధం కావడం లేదు. ఏమిటండి?.
ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమా? భూములు లాక్కుని, భూములు కొనుక్కుని, భూములు తీసుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దాంట్లో ఆదాయాలు సంపాదిస్తాయా ప్రభుత్వాలు.. నేను ఒక్కటే అడుగుతున్నాను. దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా రాజధానిని నిర్మించారా? హైదరాబాద్‌ను ఎవరైనా నిర్మించారా?. బెంగళూరును ఎవరైనా నిర్మించారా? చెన్నైని ఎవరైనా నిర్మించారా? నాకు అర్ధం కాదు. ఆయన రాజధానిని నిర్మిస్తారా?’.
‘భూములు తీసుకుని, ప్లాట్లు చేసి, దాంట్లో ఆదాయం పొందుతారంట. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ముఖ్యమంత్రులు తప్ప, ప్రజా సంక్షేమం కోసం పని చేసే ముఖ్యమంత్రులు కానీ కాదు. ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి చంద్రబాబునాయుడు గారు.. మీకు, మీ పార్టీకి నూకలు చెల్లాయి’.
అది గోబెల్ ప్రచారం :
‘నిన్న చంద్రబాబు గారు మరో మాట అన్నారు. నిజాన్ని పదే పదే చెబుతారంట. అయితే నువ్వు పదే పదే చెప్పేది నిజం కాదు, అది కేవలం గోబెల్ ప్రచారం మాత్రమే. గోబెల్ మాదిరిగా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి, అది నిజం అని చెప్పి నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితం గడిపావు. నీవు ఇంకా అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఆ విషయాన్ని గమనించండి. నాడు ఎన్టీ రామారావు ప్రారంభించిన రాజకీయ పార్టీని అంతమొందించడానికి వచ్చిన వాడే చంద్రబాబు తప్ప, మరొకటి కాదు’.
సాధ్యాసా«ధ్యాలు పట్టించుకోకుండా! :
‘బీజేపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. వారికి, జనసేనకు ఎన్ని సీట్లు ఉన్నాయి? సాధ్యాసాధ్యాలు పట్టించుకోకుండా ఏమైనా మాట్లాడొచ్చు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే పార్టీలోకి వస్తారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నాంటే, చంద్రబాబు, లోకేష్ వల్ల ఈ పార్టీ ఇంకా బతకదని వాళ్లకూ అర్ధమైంది. అయితే ఎవరు వచ్చినా ఆ పార్టీ తిరిగి బతకదు. చంద్రబాబు హయాంలో అంతర్ధానం కాక తప్పదు. తమ్ముళ్లూ వేరే మార్గం చూసుకోవడం మంచిది’.. అంటూ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రెస్‌మీట్ ముగించారు.