ఇప్పుడు రేవంత్ కర్తవ్యమేంటి ? ఏపీలో మరెలాంటి పరిస్థితులున్నాయి ?
చాలా మంది అనుకుంటున్నదేంటంటే.. రేవంత్ కేసీఆర్ పని పట్టేస్తాడని. అంతే కాదు బీఆర్ఎస్ ని కూడా లేకుండా చేస్తాడని. ఇదే జరిగితే.. తర్వాతి పరిణామాలేంటి.. అని తరచి చూడగా రేవంతే అందుకు సరైన ఉదాహరణ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
బేసిగ్గా కేసీఆర్ ది చీమ ఆశ. చీమ తాను కుట్టడమే చనిపోవాలన్న వరం కోరుకుందట.. అయితే ఎవరు చనిపోవాలి? అన్న క్లారిటీ లేక పోవడంతో.. కుట్టడమే తాను చనిపోవడం మొదలైందట. ఎందుకంటే కుట్టించుకున్న వెంటనే అసంకల్పిత ప్రతీకార చర్య అనే సహజ న్యాయ సూత్రం ప్రకారం.. ఆ వ్యక్తి టప్పున కుట్టిన చోట చేత్తో కొట్టడం. ఆ దెబ్బకు కుట్టిన చీమ చావడం.. చక చకా జరిగిపోతూ వస్తున్నాయి.
కేసీఆర్ కూడా సరిగ్గా ఇలాగే థింక్ చేశారు. దీంతో చెప్పేదేముందీ.. ఇక్కడ టీడీపీ నామరూపాల్లేకుండా పోవడం.. అలాంటి పార్టీలో ఉండలేక.. ఆల్రెడీ తనకు ఎన్నడూ లేని విధంగా ఓటమి ఎదురు కావడంతో.. రేవంత్ సైతం బయటకు రావడం. అలా వచ్చేయడంతో తన చిరకాల ప్రతీకారం తీర్చుకునేలా కాంగ్రెస్ లో చేరడం. అలా అలా.. ఎంపీ కావడం.. ఆపై సీఎం సీటుపై గురి పెట్టడం ఎంత వేగంగా జరిగాయో అందరికీ తెలిసిందే.
రేపటి రోజున ఇలాంటిదే.. రేవంత్ నుంచి మరో ప్రతీకార ప్రక్రియ నమోదు కాదన్న గ్యారంటీ ఏం లేదంటారు కొందరు. ఈ కసీ క్రోధం తీర్చుకోడానికి రేవంత్ పుట్టుకొచ్చినట్టు.. బీఆర్ఎస్ నుంచి ఎవరో ఒకరు పుట్టుకు రారని ఎలా చెప్పగలం అని అంటారు మరి కొందరు.
ఏంటండీ ఇదంతా? ఇవాళేనండీ ప్రభుత్వం ఏర్పాటైంది..అప్పుడే ఇంత ఘాటు వ్యాఖ్యానాలా? అనంటారేమో. అలాగని రాజకీయం అంటే కృష్ణా రామా అని ఊరకే కూర్చోలేరు కదా? ఆల్రెడీ శపథం కూడా రికార్డయిపోయింది. కాలం దాన్ని రికార్డు చేసింది కూడా. నన్ను చిప్ప కూడు తినిపించిన వాడికి నేను కూడా అదే స్థాయిలో.. చిప్ప కూడు తినిపించడం ఖాయం అంటూ.. రేవంత్ ఆల్రెడీ తన రివేంజ్ ని ప్రకటించేశారు కూడా. ఇప్పుడు నిజంగానే రేవంత్ గానీ కేసీఆర్ పై రివేంజ్ తీర్చుకుంటే పరిస్థితేంటి? దీన్నిబట్టీ చూస్తే బీఆర్ఎస్ నిజంగానే అంతరించిపోతుందా? అందుకు తగిన అవకాశముందా? ఇలా జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదో పెద్ద పొలిటికల్ డ్రామా ??
ఇక్కడ రాజకీయ ఆటవిక న్యాయంలో.. ఎత్తుకు పై ఎత్తులు వేయకుంటే చాలా చాలా కష్టం.. పదేళ్ల పాటు అధికార భారం మోసీ మోసీ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న బక్కాయన.. తిరిగి తన బలం పుంజుకుని.. తన దైన స్టైల్లో చక్రం తిప్పుతారా? అందుకు మన దగ్గరున్న ఎవిడెన్సులు ఏమై ఉంటాయ్? అని చూస్తే ఇటీవల కడియం శ్రీహరి అన్న మాటలను ఒకసారి పరిగణలోకి తీసుకోవల్సిన అవసరముంది అదేంటంటే, 39+8+7= 54. కావల్సినవి ఆరు సీట్లే.
ఇప్పటి వరకూ కాంగ్రెస్ కి ఉన్న సీట్లు 65 మాత్రమే. వీటిలో ఆరు లాగేస్తే.. మిగిలేది 59. కూనంనేని(సీపీఐ) తో కలుపుకుంటే మళ్లీ అరవై అయిపోతాయి. అంటే ఓ ఏడు సీట్లను బయటకు లాగాలన్నమాట. మరీ అంత ఎడ్జ్ తో వర్కవుట్ కాదు కానీ.. దానికి తోడు బీజేపీ\ ఎంఐఎం కలసి రావడం కూడా చాలా కష్టం కాబట్టి.. 15- 20 సీట్లను ఖచ్చితంగా తీయగలగాలి. అలా మనదైన ప్రభుత్వం తిరిగి మూడోసారి ముచ్చటగా ఏర్పాటు చేసుకోవచ్చు. అది సాధ్యమేనా? ఇందుకంటూ ఏదైనా ఖర్చవుతుందంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ప్రజల మధ్య చులకన కాకుండా చూసుకోవాలి. అలజడి చెలరేగకుండా చూడాలి. అలా చూసుకోవాలంటే కాంగ్రెస్ లోనే ఒక లుక లుక మాస్టర్ కావాలి.
గతంలో అక్కడి నుంచి శాసనసభా పక్షాన్ని లాగేయటానికి అవసరమైన కోవర్టిజం చేసిన వారిని మరింత గట్టిగా పట్టుకోవాలి. అక్కడేసే సాదాసీదా మంత్రి ముష్టి.. కాకుండా మరేదైనా బలమైన ఆయుధం వాడాలి. అలా వాడ్డం ఒక అత్యావసరం కూడా.
ప్రమాణ స్వీకారం జరిగిన రోజే ఇలా రాయడం ఏమంత మంచి విషయం కాదు. కానీ అంతకన్నా ముందే కడియం శ్రీహరి చేసిన కామెంట్ల వల్లే.. ఇలా ఆలోచించాల్సి వస్తోంది. దానికి తోడు గత చరిత్ర కూడా ప్రతీకారేచ్ఛ రగిల్చేలాగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దిశగా అంచనాలను కదపాల్సి వస్తోందని అంటారు కొందరు.
ఇదొక జీవన్మరణ సమస్య. ఇలా చేయకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చేజారే.. ముప్పు పొంచి ఉంది. అంతే కాదు… పార్టీ మనుగడకే అతి పెద్ద ప్రమాదమూ ఏర్పడనుందని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ మరో పాయింట్ కూడా ఖచ్చితంగా ప్రస్తావన చేయాల్సి వస్తోంది.. అదేంటంటే.. ఈ భారాన్ని మోసే వారెవరని?
నిజం చెప్పాలంటే కేటీఆర్, హరీష్ రావులు.. ఈ దిశగా కనీసం ఆలోచించేలా కూడా కనిపించడం లేదు. ఎందుకంటే వీరికి అధికార దాహం ఎప్పుడో తీరిపోయింది. దానికి తోడు కేటీఆర్ సీఎం అన్న పేరెత్తగానే మొదట గ్రేటర్ కి గండి పడగా.. ఇప్పుడు ఏకంగా పార్టీ ఓటమి భారాన్ని మోయాల్సి వస్తోంది.
సరే, హరీష్ ను ఈ దిశగా ప్రేరేపించి.. పార్టీ బయటకెళ్లి కొత్త పార్టీ పెట్టుకునే అవకాశం కల్పించగా.. ఆయనేం పెద్దగా రియాక్ట్ కాలేదు. మామయ్య జీవించి ఉండగా.. తానీ పని చేయడం వీలు కాకపోవడమూ సమస్యాత్మకంగా మారింది.
కొన్ని కథనాలను అనుసరించి చెబితే.. డిఎంకే, అన్నాడిఎంకేలాగా.. కేటీఆర్, హరీష్ చెరో పార్టీ పెట్టుకుని.. వాటి ద్వారా రాజ్యాధికారాన్ని పంచుకుంటూ ముందుకు సాగాలని.. అందుకు తగిన వాతావరణం ఏర్పాటు చేయగా… అందుకు హరీష్ పెద్దగా కోపరేట్ చేయలేదనే అంటారు నిపుణులు.
బేసిగ్గా హరీష్ రేవంత్ అంత కృషి చేయాల్సిన అవసరం లేదు. ఉద్యమకాలంలో వాళ్లు పడాల్సిన కష్టం పడ్డారు. పొందాల్సిన సుఖం పొందేశారు కూడా. దాదాపు నెంబర్ టూ స్థాయి హోదాలను సైతం అనుభవించేయటం తెలిసిందే. దీంతో కేటీఆర్, హరీష్ అనే ఈ ఇరువురి చాప్టర్లలో రివేంజ్ డ్రామాలేమంతగా ఉండేలా కనిపించడం లేదు.
ఇక మిగిలింది ఒక్కే ఒక్క ఛాన్స్.. కేటీఆర్ కొడుకు హిమాన్ష్.. హిమాన్ష్ అంతటి రాజకీయ భారాన్ని మోయగలడా? అందుకు తగిన ఆస్కారం, అవకాశముందా? అంటే అందుకు కాలమే సమాధానం చెప్పాలి.
ఈ మొత్తం ఇష్యూలో ఇప్పటికైతే ఒక సన్నివేశానికి అయితే అవకాశం మిగిలి ఉంది. అది కేసీఆర్ ని జైలుకు పంపడం.. తద్వారా ఆయన నాయకత్వంలోని బీఆర్ఎస్ ని భ్రష్టు పట్టించడం.. ఆపై పార్టీ ఉనికి లేకుండా చేయటం. అదే జరిగితే.. నెక్స్ట్ ఏంటి??? అంటే, తిరిగి హిమాన్షు ద్వారా.. ఈ రివేంజ్ డ్రామాకు ఫుల్ స్టాప్ వేయడం. అసలు అప్పటి వరకూ రేవంత్ కి పవర్ లో నిలిచే స్కోప్ ఉందా? ఈ రివేంజ్ స్టోరీ అక్కడి వరకూ సాగే ఛాన్సుందా? అంటే ఒకరకంగా లేదనే చెప్పాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్.. రేవంత్ యాటిట్యూడ్ లో వచ్చిన మార్పును ఒక ఉదాహరణగా తీసుకోవాలి. గెలుపు ఆనందమా.. లేక ముందే రాసి పెట్టుకున్న స్క్రిప్టా తెలీదు కానీ, రేవంత్ మాటలను బట్టీ చూస్తే చాలానే మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. మనం ఇప్పుడు గతంలోలా సాదా సీదా రాజకీయ నాయకులం కాదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం.. కాబట్టి వి హావ్ టు బిహేవ్ ప్రాపర్లీ.. అంటూ.. రేవంత్ చేసిన సాఫ్ట్ కామెంట్ల ద్వారా.. నో రివేంజ్ డ్రామా అన్న సంకేతాలను పంపినట్టే అర్ధం చేసుకోవాలి.
దానికి తోడు రేవంత్ ముందు చాలానే సవాళ్లున్నాయి. మొదట ఆరు హామీలను అమలు చేయాలి. ఆల్రెడీ రాష్ట్రం అప్పు ఐదు లక్షల కోట్లుగా ఉంది. ఆపై సీనియర్లను సమర్ధవంతంగా హ్యాండిల్ చేయాల్సి ఉంది. ఏ చిన్ని అలజడి చెలరేగినా.. వెనక తాటాకులు అంటించేస్తారు. ఆ మంట తాలూకూ వేడిమిని తీస్కెళ్లి ఢిల్లీ దాకా పాకించేస్తారు.
ఇవన్నీ అలా ఉంచితే కేసీ వేణుగోపాల్ చేసిన కీలక వ్యాఖ్యలను బట్టీ చూస్తే రేవంత్ కేవలం ఒక కీలుబొమ్మ మాత్రమే. ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేసే ఛాన్సు లేక పోవచ్చనే అనాలి. ఆయన కేంద్రాన్ని సైతం ఒప్పించాలంటే.. అందుకు తగిన అవకాశాలు కూడా లేవని గ్రహించాలి.
పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి దగ్గరైనా ఓ పాతిక వరకూ ఎంపీ సీట్లున్నాయేమోగానీ.. ప్రస్తుతం రేవంత్ ముందున్నవి పట్టుమని పదిహేడు. ఈ పదిహేడులో రేవంత్ శక్తి సామర్ధ్యాలు.. పదింటిని కైవసం చేసుకున్నా కూడా సెంటర్ లో గవర్నమెంటుకు అవసరమయ్యే.. బలమైతే కాదు.
వైయస్ హయాంలో అంటే.. అప్పట్లో నలభై రెండు ఎంపీ సీట్లుండేవి కాబట్టి.. వాటిలో మేజర్ విజయాలను సాధించడం ద్వారా ఆయనకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగే సత్తా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ కి ఈ తరహా కుషన్ లేదు. దీన్నిబట్టీ చూస్తే రేవంత్ ఈ పాయింటాఫ్ వ్యూలో కూడా కాస్త బలహీనుడనే చెప్పాలి.
నిజానికి కేసీఆర్ తనకు తాను అతి బలవంతుడిగా భావించడం. జనం ముందు కాస్త క్రేజ్ గా ఉంటుందని టీడీపీని తరిమి తరిమి కొట్టడం ఇప్పుడు ఎంత చేటు తెచ్చిందో.. రేవంత్ ఈ సరికే గ్రహించి ఉంటాడు. రేపు తాను కూడా ఇలాగే చేస్తే తనకూ ఏదో రూపంలో ముప్పు పొంచుకు రావచ్చనే భావిస్తున్నట్టుగానూ చెప్పాలి.
ఏపీలో కూడా ఇంచుమించు ఇలాంటి స్థితిగతులే ఉన్నాయి. కొన్ని కొన్ని భోగట్టాల ప్రకారం కమ్మల్లో తమ ప్రధాన ప్రత్యర్ధిలో మరో రంగాను చూడాలన్న కసి- క్రోధం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే ఇందుకు వారి ముఖ్య ప్రత్యర్ధి అంతగా ఆలోచించడం లేదు కానీ.. ఈసారికిగానీ తాను గట్టెక్క గలిగితే.. టీడీపీ ఆటోమేటిగ్గా కనుమరుగై పోతుందన్న ప్రణాళిక రచిస్తున్నారులా ఉంది చూస్తుంటే. మరి చూడాలి.. ఏం జరుగనుందో!
ప్రత్యేక కధనం – జర్నలిస్ట్ ఆది