జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగాలు క్రమంగా పస లేకుండా పోతున్నాయి. పదేళ్ల కిందట పార్టీ పెట్టినప్పుడు తిలక్ కవిత్వాన్ని అడ్డంగా వాడుకున్న పవన్ కల్యాణ్ ఇప్పటికే చాలా అభాసుపాలయ్యాడు. వివిధ సందర్భాల్లో పవన్ కల్యాణ్ మాటలు ప్రహసనాలుగా మారాయి. ఇప్పటికి తేలిందేమిటంటే.. పవన్ కల్యాణ్ కు ఇప్పుడు జగన్ అంటే విపరీతమైన అక్కసు, ద్వేషం, తీవ్రమైన అసూయలు తప్ప మరేం లేవనేది!
ఈ అక్కసు, అసూయ, ద్వేషాలతో పవన్ తనేం మాట్లాడుతున్నానో తనే అర్థం చేసుకోలేనట్టుగా ఉన్నాడు. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో కనీస విచక్షణ కూడా కోల్పోయి పవన్ కల్యాణ్ తన ప్రసంగాలను చేస్తూ ఉన్నాడు. తనను చూడటానికి వచ్చే జనసైనికులకు ఎలాగూ తనేం మాట్లాడినా అర్థం కాదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయం గురించి ఇది వరకే విశ్లేషించాడు. పవన్ ఏం మాట్లాడినా.. కేరింతలు కొట్టడమే తప్ప పవన్ ఏం మాట్లాడుతున్నాడో కూడా కనీసం వినే గుణం కూడా జనసైనికులకు లేదని వర్మ విశదీకరించాడు. తనకు గుండు కొట్టించారని తెలుగుదేశం వాళ్లు ప్రచారం చేశారని పవన్ వాపోయినప్పుడు, తను కాబోయే సీఎం అంటూ పవన్ చెప్పుకున్నప్పుడు కూడా జనసైనికుల స్పందన ఒకేలా ఉంటుంది!
నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో .. దేనికెలా స్పందించాలో కూడా అర్థం చేసుకోలేని మాస్ మానియాలో జనసేన కార్యకర్తలుంటారు. మరి వారికి పవన్ ఏం మాట్లాడుతున్నాడో అవసరం లేకపోవచ్చు కానీ, మిగతా వారు పవన్ మాటలను గమనిస్తారు. ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అనే విషయాలను వారు ఆలోచిస్తారు! ఏతావాతా పవన్ కల్యాణ్ కు ఇప్పుడు ఉన్నది కేవలం జగన్ అంటే అక్కసు, అసూయ, ద్వేషం మాత్రమే!
ఇంతకు మించి రాజకీయాల్లోకి వచ్చి తనేదో సాధించాలని, తనేదో సీఎం అయిపోవాలని, తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని.. పవన్ కు ఏ కోశానా లేదు! కేవలం జగన్ అంటే ద్వేషం, జగన్ అంటే అక్కసు! ఈ తత్వంతో పవన్ కల్యాణ్ ఎంత వరకూ దిగజారడానికి అయినా రెడీ అయిపోయాడు. ఇందు కోసం చంద్రబాబును అడ్డంగా సమర్థించడం, జైలు ముందు పొత్తు ప్రకటన చేయడం, టీడీపీ పల్లకి మోయడానికి బోయగా మారడం.. ఇవన్నీ పవన్ పతనావస్థలు!
పదేళ్లు అయ్యింది పార్టీ పెట్టి.. ఇన్నేళ్లలో కూడా పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యే కాలేకపోయాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏవైనా సీట్లు కేటాయిస్తే, వాటిల్లో కూడా చంద్రబాబు చెప్పిన వారిని పోటీ చేయించడం తప్ప పవన్ కల్యాణ్ కు మరో మార్గం లేదు! చంద్రబాబు పదో పాతికో సీట్లు కేటాయించినా.. వాటిల్లో తన పార్టీ మనుషులుగా నిలబెట్టుకోవడానికి పవన్ కు శక్తి లేదు! ఇంత శక్తియుక్తిపరుడైన పవన్ కల్యాణ్ తరచూ జగన్ స్థాయి గురించి మాట్లాడతాడు! జగన్ పై అక్కసు వెల్లగక్కుతాడు! అర్థం లేకుండా అదేదో మాట్లాడతాడు! తనను తాను దేశభక్తుడిని అని చెప్పుకుంటాడు! ఏ దేశం భక్తుడివి బాబూ నీవు తెలుగుదేశం భక్తుడివేనా.. అని అంతా అనుకునే పరిస్థితి వచ్చినా.. పవన్ కల్యాణ్ తన భ్రమల లోకంలో జీవిస్తూ అలాగే ఊరేగుతున్నాడు.
ఇక రాయలసీమ రౌడీలను, పులివెందుల నుంచి మనుషులను తెచ్చారు అంటూ వాపోవడం పవన్ కల్యాణ్ కు కొత్త కాదు. ఎప్పుడు తన వాళ్ల ముందుకు వచ్చినా ఇదే ఏడుపు! విశాఖకు పులివెందుల నుంచి మనుషులు తెచ్చారని అంటాడు, మరో చోటకు వచ్చారంటాడు! కేంద్ర ఇంటెలిజెన్స్ తనకు సమాచారం ఇచ్చిందంటాడు! మరోసారి తనకే తెలిసిందంటాడు! ఇలా ప్రాంతాల మధ్యన విషం చిమ్మి, వైషమ్యాలను రెచ్చగొట్టడాన్ని పనిగా పెట్టుకున్న పవన్ కల్యాణ్ తనను తాను దేశభక్తుడిని అని తనకు కులం లేదని, ప్రాంతం లేదని అనో విశ్వనరుడిని అని చెప్పుకోవడానికి మించిన కామెడీ లేదు. ఇలాంటి కామెడీలు ఒకటీ రెండు రోజుల చేస్తే వీరాభిమానులు అయినా హర్షిస్తారు. అయితే ప్రతి రోజూ ఇదే కామెడీ చేస్తే.. తనో కమేడియన్ అవుతానని పవన్ ఎప్పటికి గ్రహిస్తాడో!
మరి పార్టీ పెట్టి పదేళ్లు గడిచినా ఒకటికి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిన పవన్ కల్యాణ్.. ఇదే తీరున కొనసాగితే ఈ ఖ్యాతే శాశ్వతంగా మిగిలిపోయే అవకాశాలూ ఉన్నాయి. విపరీతమైన అహంకారంతో కనిపించే పవన్ కల్యాణ్ మరోసారి జగన్ సీఎం అయితే ఆ అక్కసుతో తనను తాను దహించుకునేంత అసూయ ద్వేషాలతో రగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి!
ప్రత్యేక కధనం