‘భూగోళం’ కథానిక – రచన : యం. సంజీవి : 1930 ప్రాంతాల్లో మారేడుమిల్లి గ్రామంలో పోరుమామిళ్ల జనార్ధనరావు అనే వ్యక్తి ఉండేవాడు అతని భార్య రాజారత్నమ్మ. వీళ్ళిద్దరికీ అడవులన్న చెట్లన్న ఎనలేని ప్రేమ పిచ్చి ! ఆ ప్రేమ పిచ్చి తోనే ఆ రోజుల్లో బిఏ చదివి కూడా జనార్ధన రావు అడవుల్లోకి వెళ్లి గుర్రం మీద ఉత్తరాలు అందించే పోస్ట్ మాన్ ఉద్యోగం చేసేవాడు. ఆ మిగతా అడవిలోని చెట్లను .. అక్కడి పర్యావరణం పరిరక్షణలోనూ ఎంతో సంతృప్తి. ఆయన భార్య ఆ గుర్రం మీద తన భర్తకు వెనుక కూర్చొని కొంగులో విత్తనాలు మూటగట్టుకొని ఆ విత్తనాలు అడవుల్లో వేస్తూ అవి మొలకెత్తి చెట్లుగా వృక్షాలుగా ఎదిగితే తన కోరిక తీరినట్లే… అని పూజలు చేసేది…
ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు . పెద్దవాడు పోరుమామిళ్ల సీతారామయ్య చిన్నవాడు పోరుమామిళ్ల రామ శంకరం తండ్రి మాట మీద సీతారామయ్య సివిల్స్ కు వెళ్లకుండా ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యాడు . తండ్రి లాగానే నర నరాల్లో పర్యావరణాన్ని జీర్ణించుకున్నాడు. రామ శంకరానిది వేరే దారి వాడెప్పుడూ అడవిలోని కట్టెలు దొంగతనంగా అమ్మకం చేస్తుంటాడు . జనార్ధన రావుకు ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ఇచ్చింది .అవార్డు అందుకోవడానికి దంపతులు ఇద్దరు ఢిల్లీ వెళ్లారు.
తిరిగి వచ్చేసరికి దారుణం జరిగిపోయింది. రామశంకరం అడవి దొంగలతో చేతులు కలిపి ఆ ప్రాంతంలోని చెట్లను నరికించేసాడు దొంగలకు అమ్మేశాడు. ఇది తెలుసుకున్న జనార్ధన్ రావు రామశంకరాన్ని కొట్టి కొట్టి చంపేశాడు ….చెట్ల కోసం పేగు బంధాన్ని తెంచేసుకున్నాడు. జనార్ధనం మీద అభిమానం ఉన్న ఓ ఆటవిక దంపతులు ఆ హత్య తామే చేశామని లొంగిపోయారు. వారిద్దరి బిడ్డ ఎనిమిదేళ్ల రాంబాబుని సీతారామయ్య ఆదరించాడు. అడవి దొంగలకు తమ్ముడికీ సహకరించాడని, సీతారామయ్య ఉద్యోగం పోయింది. కాలం ప్రస్తుతానికి వస్తే… అడవుల్లోంచి వచ్చేసిన సీతారామయ్య తన వెంట భార్య పసికందు రాఘవ, రాంబాబులతో సహా అడవిలోంచి ఓ మారేడు మొక్కని తెచ్చి ప్రాణప్రదంగా బిడ్డతో సమానంగాపెంచాడు.
సీతారామయ్య కొడుకు రాఘవ ఓ ఫర్టిలైజర్ కంపెనీకి ఎం.డి అతని భార్య మాధవి. చదువుకున్న పిల్ల. మామగారి వారి నాన్నగారి పర్యావరణం మీద ప్రేమ మాధవిని ఆకర్షించింది. అప్పటినుంచి బయోటిక్ సబ్జెక్టు మీద పరిశోధన ప్రారంభించి ఓ ధీసెస్ వ్రాస్తుంది. ఇది ఇలా ఉండగా రాంబాబుకి తన బావమరిది కూతురు పార్వతిని ఇచ్చి పెళ్లి చేశాడు. పార్వతి తండ్రి పాపనాశం. అతనికి తన కూతుర్ని రాఘవికి ఇచ్చి పెళ్లి చేయలేదన్న అక్కసు ఉంది . ఆస్తి దక్కుతుంది అని ఈ ఇంట్లోనే పడి తింటూ కుట్రలు చేస్తుంటాడు. ఆ కుట్రలో భాగంగానే సీతారామయ్య మారేడుమిల్లి అడవుల్లో విత్తనాలు చల్లడానికి వెళ్ళినప్పుడు ఇంటి ఆవరణలో పెరుగుతున్న మారేడు వృక్షాన్ని నరికించి పదివేల రూపాయలకు అమ్మేశాడు. ఇది చూసి రాఘవ మాధవి రాంబాబు షాక్ అయిపోయారు .
ఈ విషయం సీతారామయ్యకు ఎలా చెప్పాలి ? ఎలాగా? .. సీతారామయ్య వచ్చాడు . చెట్టు లేకపోవడం గమనించాడు .అంతే … ఆరోజు నుంచి అతనికి మతిస్థిమితం తప్పింది. కొద్దిసేపు మామూలుగా ఉంటాడు మరికొద్ది సేపట్లో చెట్టు మీద గ్రద్దలాగా మారిపోయి ఉగ్రంగా ప్రవర్తిస్తుంటాడు . ఇది ఇలా ఉండగా రాఘవ పని చేసే కంపెనీ వాళ్లు సరికొత్త ఫెర్టిలైజర్ కనిపెట్టారు. 74 దేశాలు నిషేధించిన ఎండోసల్ఫాన్ ను మరికొన్ని ఎరువులతో కలిపిన ఆ ప్రొడక్ట్ వలన చాలా ప్రమాదాలు ఉన్నాయని రాఘవ కంపెనీకి ఎదురు తిరిగాడు. కూరగాయలు పండ్లు మొదలగునవి అసహజంగా పెరిగిపోయి మానవులకు హాని చేస్తాయి అని పోరాడాడు. వాళ్లతో పంతం పట్టి పందెం వేసుకుని ప్రమాదాన్ని నిరూపించడానికి ఆ కూరగాయలు 10 నెలలు పచ్చివిగా తిన్నాడు. ఫలితం అతని ఆరోగ్యంలో తేడా చేసింది పరీక్షల్లో అతనికి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని తేలింది.
కానీ అదే సమయంలో అతని భార్య మాధవికి తాను రిసెర్చ్ చేసిన పుస్తకానికి అవార్డు వచ్చింది. ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్లో ప్రసంగించాలని ఆహ్వానం వచ్చింది… ఒకపక్క తండ్రి అనారోగ్యం మరోపక్క తనకి క్యాన్సర్ ఇంకో పక్క భార్యకు పర్యావరణం మీద వ్రాసిన పుస్తకానికి అవార్డు. రాఘవను ముంబాయి చికిత్స కోసం వెళ్లాల్సిందే అని డాక్టర్ పట్టు పట్టాడు. ఈ వార్త ఇంట్లో ఎవరికి తెలియదు. తను కంపెనీ పని మీద ప్రమోషన్ మీద ముంబై వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. తీరా చూస్తే భార్యకు కూడా అతని వెంట బయల్దేరాల్సి వచ్చింది. ఇద్దరు రైల్వే స్టేషన్ కు చేరారు. రాఘవ పరిస్థితి క్షణం క్షణం విషమిస్తుంది.
ఆ పరిస్థితిలో అతనికి ఒకటే కోర్కె. మూడు గంటల రైలు ఆలస్యం సమయంలో… ఢిల్లీలో తన భార్య కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలి అని. తను చూడాలి. ఇది రాఘవ కోర్కె ! భర్త పరిస్థితి తెలిసిన మాధవి ఆలోచించింది ఇప్పుడు… ఇక్కడ నా ప్రసంగమా ? అన్నది. ఇది నా ఆఖరి కోరిక అన్నాడు. విధిలేని పరిస్థితిలో మాధవి ఆ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నే… వేదిక అనుకొని ప్రసంగించింది ” భూమికి జ్వరం వచ్చింది భూగోళానికి జబ్బు చేసింది ఓజోన్ పొర చిరిగిపోతుంది. మరికొద్ది కాలంలో ఎన్నో విపత్తులు సునామీలు భూకంపాలు వచ్చేస్తున్నాయి . దీనికి కారకులు ఎవరు ? మీరు. మీరు.. మానవులు, విషపూరిత వ్యర్ధాలు పనికిరాని ఎరువులు ఇంకా ఎన్నో పర్యావరణాన్ని నాశనం చేసే ప్రయోగాలు అంటూ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇస్తుండగానే రాఘవ తలవాల్చేశాడు. ఇంతలో వాళ్లు ఎక్కవలసిన రైలు వచ్చేసింది.
— శుభం —