Lip Care : అధరాలు అందంగా, మృదువుగా, లేత గులాబీ రంగులో మెరవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే శరీర చర్మం కన్నా పెదవులు మరింత సున్నితంగా ఉంటాయి. దీని కారణంగా అవి తేమ కోల్పోవడం, నల్లగా మారడం, నిర్జీవంగా మారుతుంటాయి. పెదవులపై సహజ నూనెలు ఉత్పత్తి చేసే సేబాషియస్ గ్రంథులు ఉండవు. దీంతో అవి త్వరగా పొడిబారుతూ ఉంటాయి. సూర్యరశ్మి నుంచి వెలువడే యూవీ కిరణాలు వల్ల పెదవులు త్వరగా పొడిబారి దెబ్బతింటాయి. పెదవులు ఎప్పుడూ తేమగా, గులాబీ రంగులో మెరవాలంటే.. కొన్ని చిట్కాలు సహాయపడతాయి.
తేనెతో ఇలా..
మీ పెదవులు ఎర్రగా, మృదువుగా, తేమగా ఉండాలంటే.. తేనె ప్యాక్ సహాయపడుతుంది. ఇందుకోసం టీస్పూన్ తేనెలో అరటీస్పూన్ దానిమ్మ రసం వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత బయటకు తీసి ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకోవాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే.. పెదవులకు తేమ అందుతుంది. దానిమ్మ రసం పెదాలకు మంచి రంగు ఇస్తుంది.
గులాబీ రేకులతో..
గులాబీ రేకులు అధరాల అందం కాపాడటానికి సహాయపడతాయి. గులాబీ పువ్వులో విటమిన్ ‘ఇ’ ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి తేమను అందిస్తుంది. మీ పెదవులకు తేమ అందిచడానికి, గులాబీ రంగు ఇవ్వడానికి.. కొన్ని గులాబీ రేకల్లో కొన్ని పచ్చి పాలు పోస్తూ పేస్ట్‌లా చేసుకోవాలి. దీంతో పెదాలపై కాసేపు మృదువుగా రుద్దాలి. ఇలా చేస్తే పెదవులకు తేమ అందడంతో పాటు మంచి రంగు వస్తాయి.
గ్లిజరిన్‌తో..
గ్లిజరిన్‌ని రోజూ ఉపయోగించడం వల్ల పెదాలు సున్నితంగా తయారవుతాయి. నల్లబడిన పెదాల రంగును తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. అందుకే ఐదు వంతుల నిమ్మరసంలో ఒక వంతు గ్లిజరిన్ వేసి రోజూ పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకోవాలి. ఆపై పావుగంట అలాగే ఉంచుకొని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్నిరోజుల పాటు చేస్తే పెదాలు మృదువుగా మారతాయి.
పంచదారతో..
పెదాలపై డెడ్ స్కిన్ పొరను తొలగించాలంటే వారానికి ఒకసారైనా టూత్ బ్రష్‌తో షుగర్ స్క్రబ్‌ను అప్లై చేయాలి. ఆ తర్వాత నీళ్లతో శుభ్రం చేయండి. ఆ తర్వాత వెన్నను పెదాలపై రాయడం వల్ల ఎల్లప్పుడూ తేమగా, మృదువుగా కనిపిస్తాయి.