Hungry at Night : మనం నిద్రపోవడానికి రెండు గంటల ముందే రాత్రి భోజనం కంప్లీట్ చేయాలని చెప్తారు డాక్టర్లు. కానీ కొంతమందికి రాత్రి పడుకున్న తర్వాత మధ్యలో ఆకలి వేస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఏం తినాలి? అసలు తినొచ్చా.. లేదా..?
ఒకప్పుడు సాయంత్రమే భోజనం కానిచ్చేసి ఏడెనిమిది గంటల కల్లా పడుకునేవాళ్లు. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి పనులు చేసుకునేవాళ్లు. ఇప్పటికీ కూడా పల్లెటూళ్లలో రాత్రి త్వరగానే పడుకుంటారు. నగరాల్లోనే అర్ధరాత్రి వరకూ మెలకువతో ఉండటం, ఉదయం లేట్ గా లేవడం లాంటి అలవాట్లు ఉంటాయి. అందుకే రాత్రి పూట మళ్లీ ఆకలేయడం నగరవాసులలో సాధారణం.
సాధారణంగా సిటీల్లో ఉండేవాళ్లకు రాత్రి భోజనమే ఆలస్యం అవుతుంది. తొమ్మిది పది గంటల వరకూ తినడం కుదరని వాళ్లుంటారు. కొందరు అర్ధరాత్రి భోజనం చేసేవాళ్లు కూడా ఉంటారు. అయితే తొందరగా తినేసినప్పుడు అర్ధరాత్రి వరకూ మొబైల్ చూస్తూ నిద్ర పోకపోయినా లేక టీవీ చూస్తూ ఉన్నా మళ్లీ ఆకలేస్తుంది. ఓటీటీలు వచ్చిన తర్వాత అర్ధరాత్రి వరకూ టీవీ చూస్తూ మెలకువతో ఉండేవాళ్లు పెరిగిపోయారు. ఇలాంటప్పుడు టీవీ చూస్తూ ఇంట్లో ఉన్నో ఏ చిప్స్ లాంటివోతినేవాళ్లుంటారు. లేక ఏదో ఒక స్నాక్స్ తింటుంటారు. కానీ రాత్రి పూట ఇలా ఏవి పడితే అవి తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా అనేక సమస్యలు వస్తాయి.
పెరుగు
రాత్రి ఆకలిగా అనిపించినప్పుడు పెరుగు తీసుకోవడం బెటర్. పెరుగులోప్రోబయాటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. పెరుగులో కార్బోహైడ్రేట్లు తక్కువ. ప్రొటీన్లు ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెరలు స్టెబిలైజర్ అవుతాయి. పెరుగుతో పాటుగా చెర్రీస్ తీసుకోవచ్చు. అయితే మరీ చిక్కటి పెరుగు వద్దు.
పాప్ కార్న్
టీవీ చూసేటప్పుడో, సినిమా చూసేటప్పుడో పాప్ కార్న్ సరైన జోడీ. చాలామందికి పాప్ కార్న్ అంటే ఇష్టం కూడా. రాత్రిపూట పాప్ కార్న్ తినవచ్చు. అయితే పాప్ కార్న్ ను వేయించేటప్పుడు వెన్నగానీ, ఉప్పు గానీ వేయకూడదు. దీనిలో కొంతవరకు ఫైబర్ కూడా ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఆకలి కాకుండా కూడా ఉంటుంది.
రాత్రిపూట పిజ్జా తినడం చాలామందికి అలవాటు. ఇష్టపడుతారు కూడా. పిల్లలు, యంగ్ జనరేషన్ కి పిజ్జా అంటే మక్కువ ఎక్కువ. కానీ రాత్రిపూట పిజ్జా తినడం మంచిది కాదు. రాత్రిపూట ఇది సరిగా అరగదు. పైగా కడుపునొప్పి, స్టమక్ అప్ సెట్, కడుపుబ్బరం కలిగిస్తుంది. పిజ్జాలో ఛీజ్ లాంటి కొవ్వు పదార్థాలు ఎక్కువ. కాబట్టి మామూలుగానే పిజ్జాతో కేలరీలు ఎక్కువగా వస్తాయి. ఇక రాత్రిపూట తింటే త్వరగా బరువు పెరుగుతారు.