Monsoon Diet : వర్షం పడుతుంటే స్పైసీగా తినాలని అనిపించడం సహజం. మాంసాహారులైతే ఏదో ఒక నాన్ వెజ్ఐటమ్స్పైసీగా తినాలని కోరుకుంటారు. కానీ వర్షాకాలంలో నాన్ వెజ్ ఎక్కువగా తినొద్దని చెప్తుంటారు మన పెద్దవాళ్లు. దీనికి కారణాలు లేకపోలేదు. అన్ని కాలాల్లోనూ మన జీర్ణ వ్యవస్థ ఒకే మాదిరిగా ఉండదు. అందుకే సీజనల్ ఫుడ్ తీసుకోవాలని చెప్తుంటారు న్యూట్రిషనిస్టులు. మనకు దొరికే కూరగాయలు, పండ్లు కూడా సీజన్ బట్టి ఉంటాయి.
ఎండాకాలంలో అయితే జీర్ణ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది. కాబట్టి నాన్ వెజ్ లాంటి భారీ ఆహారం తీసుకున్నా అరగడం సులువు అవుతుంది. కానీ వర్షాకాలంలో అలా కాదు. పైగా సమ్మర్ లో కూరగాయలు ఎక్కువగా అవైలబుల్ ఉండవు కాబట్టి నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. కానీ వర్షాకాలంలో అన్ని రకాల కూరగాయలు పుష్కలంగా దొరుకుతాయి. ఆరోగ్యాన్ని పెంచే ఈ కూరగాయలను వదిలి, నాన్ వెజ్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చికెన్.. మటన్ :
సాధారణంగా వర్షాకాలంలో మటన్ షాపుల్లో తాజా మాంసం దొరకడం కష్టం. కొన్నిసార్లు చనిపోయిన కోడి మాంసాన్ని అమ్మవచ్చు. చికెన్ కొనేటప్పుడు దానిపై మచ్చలు లేదా తెల్లటి గీతలు ఉంటే దానికి ఏదైనా వ్యాధి లేదా ఇన్ ఫెక్షన్ ఉందని అర్థం. అలాంటివి కొనొద్దు. మాంసం జిగటగా ఉండకుండా మెరుస్తూ, దృఢంగా ఉంటేనే తాజాదని భావించాలి. ఇక దాన్ని వండేటప్పుడు ముందుగా గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి. దానికి అంటుకున్న చెత్త, మురికిని పూర్తిగా తీసివేయడాలి. స్పైసెస్ వేసి ఉడికించాలి. దానివల్ల వ్యాధికారక కారకాలు నశించే అవకాశం ఉంటుంది.
కూరగాయలే బెస్ట్ :
వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ స్తబ్దుగా ఉంటుంది. జీర్ణ శక్తి అంత చురుగ్గా ఉండదు. కాబట్టి తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. అందుకే వర్షాకాలంలో ఎప్పుడైనా సులువుగా అరిగే ఆహారాన్నే తీసుకోవాలి. కానీ మాంసాహారం అరగడానికి మామూలుగానే ఎక్కువ సమయం పడుతుంది. ఇక వర్షాకాలంలో చురుకుదనం తగ్గిన జీర్ణవ్యవస్థకు మాంసాహారం అందిస్తే అది అరగకుండా అజీర్తి కావొచ్చు. వాంతులు, వికారం లాంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే వర్షాకాలంలో నాన్ వెజ్ కాకుండా కూరగాయలు తీసుకోవడమే మంచిది.