రాచకొండ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీపీ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నూతన పంథాలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేలా అధికారులు మరియు సిబ్బందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు.
ఇందులో భాగంగా క్షేత్ర స్ధాయిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ప్రేరణ కలిగించేలా కమిషనర్ గారు ఈ రోజు స్వయంగా ఎల్బి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి ప్రజలతో మమేకమై పని చేయాలనీ, వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని అదుపులో పెట్టాలని ఆదేశించారు. పలు వీధుల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాచకొండ పరిథిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అన్ని వేళలా పోలీసు అధికారులు మరియు సిబ్బంది నిబద్ధతతో పని చేస్తున్నారని, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా నిర్భయంగా డయల్ 100 మరియు 112 టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా పోలీసులకు ఫిర్యాధు చేయవచ్చని తెలిపారు. మహిళా రక్షణ కోసం షి టీమ్స్ బృందాలు అన్ని ప్రాంతాల్లో విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, డీసీపీ ఎస్ఓటీ మురళీధర్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ మరియు ఇతర అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.