Allu Arjun : శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా నటించిన చిత్రం సామజవరగమన (Samajavaragamana). రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెబా మోనికా జాన్ (Reba Monica John) హీరోయిన్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబందానికి అభినందనలు తెలియజేశారు.
ఈ సినిమా చాలా కాలం తరువాత వచ్చిన ఒక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని బన్ని అన్నారు. సినిమాను చివరి వరకు ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. రామ్ అబ్బరాజు మంచి కథను రాయడంతో పాటు అద్భుతంగా తెరకెక్కించారన్నారు. శ్రీ విష్ణు విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నానని. తన నటనతో అదరగొట్టేశాడని తెలిపారు. నరేశ్, వెన్నెల కిషోర్, నా మలయాళీ భామ రెబా మోనికా జాన్ ఇంకా ఇతర టీమ్‌సభ్యులకు అభినందనలు. అని ట్వీట్ చేశారు అల్లు అర్జున్.
బన్నీ ట్వీట్‌కు శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ స్పందించారు. ‘థాంక్యూ.. థాంక్యూ సో మచ్ డియర్ బన్నీ. మీ ట్వీట్ మా టీమ్ మొత్తంలో ఎంతో ఆనందాన్ని నింపింది. మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని శ్రీవిష్ణు రిప్లై ఇచ్చాడు.
‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్ మీరు మా సినిమా చూశారని, అది మీకు ఎంతో నచ్చిందని తెలియజేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. బిజీ లైఫ్‌లో సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంకూ సో మచ్. నేను మీకు పెద్ద అభిమానిని. మీతో కలిసి పని చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ రెబా మోనికా జాన్ ట్వీట్ చేసింది.