Thirsty after eating biryani : బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. వెజ్ అయినా నాన్-వెజ్ అయినా బిర్యానీ ప్రియులు తెగ లాగించేస్తారు. అయితే బిర్యానీ తిన్న తరువాత చాలామంది విపరీతంగా దాహం వేస్తోంది అంటారు. బిర్యానీ తినగానే దాహం తగ్గట్లేదని కూల్ డ్రింక్స్, సోడాలు కూడా తాగుతూ ఉంటారు. అసలు బిర్యానీ తిన్న తరువాత విపరీతంగా దాహం ఎందుకు వేస్తుందో తెలుసా?
ఆయిల్ ఫుడ్స్‌లో కొవ్వు అధిక శాతంలో ఉంటుంది. ఇది అరగడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఆయిల్ ఫుడ్‌లో సాల్ట్ కూడా ఎక్కువ ఉండొచ్చు. బాడీలోకి సాల్ట్ వెళ్లినపుడు దానిని బ్యాలెన్స్ చేయాలంటే శరీరం ఎక్కువ నీరు కోరుకుంటుంది. అందువల్ల దాహం వేస్తుంది.
మానవ శరీరంలో 70% శాతం నీరు ఉంటుంది. చమట, మూత్ర విసర్జన ద్వారా నీరు బయటకు పోతుంది. తిరిగి దానిని నింపుకోవడానికి మనం నీరు తాగుతాం. శరీరంలో నీరు తగ్గినప్పుడల్లా నీరు తాగడం సహజం. మనం ఆహారం తీసుకున్న తరువాత కూడా అదే జరుగుతుంది. అయితే మనం తీసుకునే ఆహారం విషయంలో ఏం తింటున్నామో గమనించుకోవడం చాలా ముఖ్యం.
పండ్లు, కూరగాయలు, సూప్‌లు వీటిని తీసుకుంటే పెద్దగా దాహం వేయదు. ఎందుకంటే వీటిలో 90% నీరు ఉంటుంది. కాబట్టి శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. ఆయిల్‌తో వేయించే నాన్-వెజ్ ఇతర ఆహార పదార్ధాలలో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల కూడా దాహం వేస్తుంది. శరీరానికి కావాల్సిన నీరు పండ్లు, ఉడకబెట్టిన కూరగాయల ద్వారానే లభిస్తుంది. అందుకే నీరు అధికశాతం ఉన్న ఆహారం తినమని ఫుడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతూ ఉంటారు. వేయించిన ఆహార పదార్ధాలు తిన్న తరువాత నీరు తాగడం కంటే కూడా ఆహారంలోనే నీరు అధికంగా ఉన్న ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.