Balakrishna in HIT 4: ‘హిట్ యూనివర్స్’ పేరుతో దర్శకుడు శైలేష్ కొలను ఫ్రాంచైజ్‌ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పటికే ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ సినిమాలు వచ్చాయి. ఇక మూడో సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించనున్నారు. నాలుగో సినిమాకు కూడా కథ రెడీ అయిపోయిందని, బాలకృష్ణ హీరోగా నటిస్తారని టాక్.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. కిందటేడాది ‘అఖండ’ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన బాలయ్య.. ఆ ఫాంను ఈ ఏడాది కూడా కొనసాగించారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది బాలయ్యకు 108వ సినిమా. ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ ఈ సినిమాకు ఫైనల్ చేసినట్టు సమాచారం. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ను ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే, అదేరోజు మరో ప్రకటన కూడా రాబోతుందట. అదే ‘HIT 4’ అనౌన్స్‌మెంట్.
‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమాతో దర్శకుడు శైలేష్ కొలను ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఆ తరవాత కిందటేడాది ‘హిట్: ది సెకండ్ కేస్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో అడివి శేష్ హీరోగా నటించారు. ఈ సినిమా విడుదల సమయంలోనే ‘హిట్ యూనివర్స్’ గురించి శైలేష్ కొలను ప్రకటన చేశారు. తాను రకరకాల హీరోలతో వరుసగా హిట్ ఫ్రాంచైజ్‌ను తీయనున్నట్టు చెప్పారు. ఈ ఫ్రాంచైజ్‌లో చాలా సినిమాలు వస్తాయన్న శైలేష్.. అన్ని కేసులను కలుపుతూ ఒక సినిమా ఉంటుందన్నారు.