Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ ఏడాది అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైనర్లను అందిస్తున్నారు. ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’తో హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ను అందించిన చిరు.. ఇప్పుడు ‘భోళా శంకర్’తో (Bholaa Shankar) పలకరించబోతున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందకు సిద్ధమవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతోన్న తాజాగా చిత్రం ‘భోళా శంకర్’ (Bholaa Shankar). చాలా కాలం తరవాత మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. 2015 నాటి తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’కు రీమేక్ ఈ సినిమా. తమిళంలో అజిత్ నటించగా.. తెలుగులో ఇప్పుడు ఆ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అలాంటి చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. దీనికి తోడు చిరంజీవి ఇప్పటికే ‘గాడ్ ఫాదర్’ (‘లూసిఫర్’ రీమేక్) చేయడంతో మరో రీమేక్ అనగానే అభిమానుల్లో కూడా నిరుత్సాహం కలిగింది. కానీ, మెగాస్టార్ లుక్, మేకోవర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో పాట చిత్రీకరించడంతో ఈ సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ ఉందని భావిస్తున్నారు.
ఇక ప్రస్తుతం ‘భోళా శంకర్’ మ్యూజిక్ మానియా ప్రారంభంకాబోతోంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ స్వరపరిచిన పాటలు ఒక్కొక్కటిగా రానున్నాయి. ఈరోజు ఫస్ట్ సింగిల్‌ను లాంచ్ చేయనున్నారు. దీని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, ‘భోళా శంకర్’ను యూఎస్‌లోనూ భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అమెరికాలో 600కు పైగా లొకేషన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆగస్టు 10న అక్కడ ప్రీమియర్లు మొదలుకానున్నాయి.