జూలై ఒకటవ తేదీ నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు మరియు విచారణలో పాటించవలసిన నూతన విధానాల మీద అందరికీ సంపూర్ణ పరిజ్ఞానం మరియు అవగహన కల్పించేందుకు రాచకొండ పరిధిలోని ఉన్నతాధికారులు మరియు అన్ని స్థాయిల సిబ్బందికి ఘట్ కేసర్ లోని విజ్ఞాన భారతి కళాశాలలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. న్యాయ నిపుణులు హై కోర్టు అడ్వకేట్ సురేష్ గారు నూతన చట్టాల మీద సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ మాట్లాడుతూ… జులై ఒకటవ తేదీ నుండి అమలులోకి రానున్న భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 ద్వారా మనదేశం అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనుందని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని, ప్రజలకి మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. మనదేశం స్వతంత్రదేశంగా మారిన తర్వాత కూడా వలసపాలన నాటి న్యాయచట్టాల ప్రకారమే నేరన్యాయ వ్యవస్థ మరియు శాంతి భద్రతల పరిరక్షణ వ్యవస్థ నిర్వహించడం జరుగుతోందని గుర్తు చేశారు. ఇన్నేళ్లలో భారత న్యాయ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం మనదేశ శాంతిభద్రతల పరిరక్షణలో ఒక మైలురాయి అని తెలిపారు.
రాచకొండ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది నూతన నేరన్యాయ చట్టాలలోని అంశాల మీద సంపూర్ణ అవగాహన పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం లకు సంబంధించిన పలుచట్టాల న్యాయశాస్త్ర గ్రంథాలను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్లకు, డిసిపిలు, అదనపు డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర పోలీసు విభాగాలకు అందించడం జరిగిందని, ప్రతీ ఒక్కరూ పూర్తి శ్రద్ధతో నూతన అంశాలను నేర్చుకోవాలని ఆదేశించారు.
ఇంతకాలం పాటిస్తున్న పాత విధానాలలో నూతన చట్టాలకు విరుద్ధమైన వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ పాటించకూడదని, నూతన సెక్షన్ల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. నూతన సెక్షన్లను ప్రతి ఒక్కరూ కూలంకషంగా నేర్చుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ అమలులో ఉన్న విధానాలను పూర్తిగా నూతన చట్టాలు పూర్తిగా మార్చడం లేదని, ప్రస్తుత సమాజాన్ని మరియు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసుల నమోదు తీరు, శిక్షల విధింపు, విచారణ పద్ధతులను వేగవంతం చేయడానికి అవసరమైన మేరకు పలు అంశాలను ఈ నూతన నేరన్యాయ చట్టాలలో మార్చడం జరిగిందని తెలిపారు. ప్రతీ స్టేషన్లోనూ సిబ్బందితో నూతన చట్టాలకు సంబంధించిన అంశాల మీద అంతర్గత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నూతన నేరన్యాయచట్టాల మీద జోన్ల వారీగా సమీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం హై కోర్టు అడ్వకేట్ సురేష్ గారు అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, డీసీపీ మల్కాజ్ గిరి పద్మజ ఐపీఎస్, ఎల్బీ నగర్ DCP ప్రవీణ్, ఐపిఎస్, ఎస్బి డీసీపీ కరుణాకర్, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్డి, క్రైమ్ DCP అరవింద్ బాబు, అదనపు డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.