Vijay Kanth : విజయకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. 90ల్లో ఆయన నటించిన తమిళ సినిమాలు చాలానే తెలుగులో అనువాదమయ్యాయి. ముఖ్యంగా ‘కెప్టెన్ ప్రభాకర్’ సినిమా తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. రజినీకాంత్, కమల్ హాసన్ చిత్రాలతో పాటు విజయకాంత్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడేవారు. కొన్ని సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. పవర్ ఫుల్ పోలీసుల పాత్రలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు.
అయితే 2005లో ఆయన డిఎండికే పేరుతో పొలిటికల్ పార్టీ ప్రకటించారు. 2010లో చాలా గ్యాప్ తర్వాత విజయకాంత్ హీరోగా మూవీ చేశారు. విరుధగిరి టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన దర్శకుడు కూడాను. చివరిగా 2015లో ఓ మూవీలో ఆయన క్యామియో రోల్ చేశారు. కొన్నాళ్లుగా విజయకాంత్ తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఒకటి రెండు సార్లు విషమ స్థితిలో ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల ఆయన కాలి వేళ్లలో మూడింటిని తొలగించారు. దీంతో విజయకాంత్ నడవలేని స్థితికి చేరుకున్నారు. చక్రాల కుర్చీకే పరిమితమైనట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, జనవరి 31న విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత తమ 33వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అనారోగ్యంతో బక్కపలచగా అయిపోయిన విజయకాంత్.. కుర్చీలో కూర్చొనే భార్య మెడలో పూలమాల వేశారు. విజయకాంత్ మొహానికి మాస్క్, కళ్లజోడు పెట్టుకోవడంతో ఆయన్ని గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉంది. తమ ఇద్దరు కుమారులు షణ్ముగ పాండియన్, విజయ ప్రభాకరన్ సమక్షంలో విజయకాంత్, ప్రేమలత వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం విజయకాంత్ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆయన అలా సన్నగా మారడాన్ని చూసి విజయ్ కాంత్ అభిమానులంతా బాధ పడుతున్నారు. మళ్ళీ మామూలుగా ఆరోగ్యంగా మారాలని కోరుకుంటూ విషెస్ చెబుతున్నారు.
திருமண நாள் வாழ்த்துக்கள் தெரிவித்த அனைவருக்கும் நன்றி. pic.twitter.com/k35gE3qjXU
— Captain Vijayakant (@iVijayakant) January 31, 2023