IND vs NZ 1st ODI : హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో భారత్ -న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో యంగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన శుభ్‌మన్ గిల్ 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించడం విశేషం. ఇది అతడికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ కాగా.. గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఇండియా… 349 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆరంభం నుంచి నిలకడగా ఆడింది. గిల్‌తో కలిసి రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడుతూ 38 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ 10 బంతుల్లో 8 పరుగులే చేసి పెవిలియన్ చేరగా.. ఇషాన్ కిషన్ 14 బంతుల్లో 5 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 31.. హార్ధిక్ పాండ్యా 38 బంతుల్లో 28 పరుగులు చేసి గిల్ కి సపోర్ట్ ఇచ్చారు. ఇక చివర్లో వాషింగ్టన్ సుందర్ 14 బంతుల్లో 12 పరుగులు.. శార్దూల్ ఠాకూర్ 3 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యారు.
Live – https://t.co/DXx5mqRguU #INDvNZ @mastercardindia pic.twitter.com/rEmRg6BzJa
— BCCI (@BCCI) January 18, 2023
అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికి శుభ్‌మన్ గిల్ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా 87 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సంచరి పూర్తి చేసిన తర్వాత మరింత స్పీడ్ పెంచిన గిల్.. 145 బంతుల్లోనే 200 పరుగులు సాధించాడు. మొత్తం 149 బంతుల్లో, 208 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. శుభ్‌మన్ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. దీంతో వన్డేల్లో భారత్ తరఫున డబుల్ సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఇక వన్డేల్లో వేగంగా 1000 పరుగులు చేసిన క్రికెటర్ గా గిల్ రికార్డు నెలకొల్పాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లీ 2 వికెట్లు, డెరైల్ మిచెల్ 2 వికెట్లు తీయగా, ఫెర్గూసన్, టిక్నర్, శాంట్నర్ ఒక్కో వికెట్ తీశారు.