అప్పుడప్పుడూ, వాళ్లకు అవసరమైనప్పుడు దొంగలు కొన్ని కాలనీల్లో తెగబడి దొంగతనాలు చేస్తూండడం మనకు తెలిసిందే…! ఇంకొందరైతే దొంగతనాన్నే ప్రొఫెషన్ గా ఎంచుకున్నారనుకోండి… వాళ్లు రెగ్యులర్ గా డ్యూటీ చేస్తారు. ఏరోజుకా రోజు రెమ్యూనరేషన్ తీసేసుకుంటారు. అయితే, ప్రొఫెషనల్ దొంగలకు కొన్ని ప్రిన్సిపుల్స్ అనేవి వుంటాయి. ఏది పడితే అది ఎత్తుకెళ్లరు.
కానీ, ఓ దొంగ విచిత్రంగా పిల్లిని ఎత్తుకెళ్లాడు. ఎక్కడో కాదు, మన హైదరాబాదులోనే. అయితే, ఆ పిల్లి యజమాని దాన్ని యాభై వేల రూపాయలకు కొన్నాడట…! పోనీ, దాని ఖరీదు చూసి టెంప్ట్ అయి దొంగిలించాడా అంటే, తిరిగి ఆ దొంగ ఆ పిల్లిని ఎక్కడైనా అదే ధరకు గానీ, ఎక్కువ ధరకు గానీ అమ్మాలంటే అదంత తేలికైన విషయం కాదుగదా…!
సరే, వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ లో ఒక విచిత్రమైన కేసు నమోదయింది. పిల్లిని దొంగిలించడంపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… వనస్థలిపురం పరిధిలోని జహంగీర్ కాలనీలో షేక్ అజహర్ మహమూద్ అనే వ్యక్తి ఒక అరుదైన జాతికి చెందిన పిల్లిని రూ. 50 వేలకు కొనుగోలు చేశారు. దానికి ఏమాత్రం లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. దానికి నోమనీ అనే పేరు పెట్టుకున్నాడు. దీని వయసు 18 నెలలు.
ఈ పిల్లి కళ్లలో ఒకటి గ్రీన్, మరొకటి బ్లూ కలర్ లో ఉన్నాయి. ఈ పిల్లి ప్రత్యేకత ఇదే. దీన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ఎత్తుకుపోయారు. దీంతో, తన పిల్లిని ఎత్తుకుపోయారంటూ మహమూద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మొత్తానికి బాగా ఆడాడు గదూ…!!