వైకుంఠ ఏకాదశి రోజు అన్ని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిపోతాయి. వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణువు గురుడ వాహనంపై భూలోకానికి దిగివచ్చి భక్తులను కరుణిస్తాడని నమ్మకం. అందుకే భక్తులందరూ ఆ రోజు దైవ దర్శనాలు చేస్తారు. 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి రానుంది. అలాగే జనవరి 3న వైకుంఠ ద్వాదశి ఉంది. ఈ తరుణంలో ముఖ్యంగా తిరుమల తిరుపతి క్షేత్రానికి భక్తులు పోటెత్తనున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం బారులు తీరనున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. జనవరి 2వ తేది నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అర్జిత సేవలు కూడా ఏకాంతంగానే నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు.
గతంలో నిర్వహిస్తున్న విధంగానే ఇప్పుడు కూడా జనవరి 11 వరకు పది రోజుల పాటు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ప్రతి రోజూ కూడా రోజుకు దాదాపు 80 వేల మందికి మాత్రమే వైకుంఠ వాకిలి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.
రోజుకు 25 వేలు చొప్పున 10 రోజులకు కలిపి 2.50 లక్షల రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లుగా టీటీడీ తెలిపింది. 2023 జనవరి కోటాలోనే ఈ టికెట్లను కూడా రిలీజ్ చేస్తామని పేర్కొంది. నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 29వ తేది నుంచి జనవరి 3వ తేది వరకూ వసతి అడ్వాన్స్ బుకింగ్ ను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.