Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త ఇప్పటికీ అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రికి కృష్ణ చేసిన సేవ మరువలేనిది. దాదాపు 350కు పైగా సినిమాల్లో నటించిన కృష్ణ… నిర్మాత గాను, దర్శకుడిగాను సేవలందించారు. కాగా ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో మహేష్ కుటుంబ సభ్యులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నెల14న అర్ధరాత్రి సమయంలో కృష్ణకు గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా… చికిత్స పొందుతూ ఈ నెల 15న తుదిశ్వాస విడిచారు.
కాగా ఒకే ఏడాదిలో అన్నయ్య, తల్లి, తండ్రి … ఈ లోకాన్ని వీడడంతో మహేష్ బాబు బాధ వర్ణనాతీతం. తండ్రి చనిపోయిన సమయంలో మహేష్ కన్నీరు మున్నీరయ్యారు. ఇదిలా ఉంటే కృష్ణ చనిపోయిన తర్వాత మొదటిసారి మహేష్ బాబు స్పందించారు. తండ్రిని తలుచుకుంటూ మహేష్ ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశాడు. “నీ జీవితం వేడుకగా గడచిపోయింది. నీ నిష్క్రమణం కూడా అంతే వేడుకగా సాగింది. అదే మీ గొప్పతనం.
మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ స్వభావం.. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. మీలాగే నీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను.. నిన్ను మరింత గర్వపడేలా చేస్తాను… లవ్ యూ నాన్నా… మై సూపర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు మహేష్. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.