Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అయితే తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కృష్ణ పర్ధివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహేష్ బాబుని ఆలింగనం చేసుకొని జగన్ ఓదార్చారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైయస్ భారతీ రెడ్డి, మంత్రి వేణు గోపాలకృష్ణ, ఐఏఎస్ పొలిటికల్ సెక్రటరీ ముత్యాల రాజు,ఓఎస్డి పి కృష్ణమోహన్ రెడ్డి, అడిషనల్ పిఎస్ కె నాగేశ్వర్ రెడ్డి, సీఎస్ఓ చిదానంద రెడ్డి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం ఉన్నారు.
కాగా కృష్ణకు చివరిసారిగా వీడ్కోలు ఇచ్చేందుకు అభిమానులు భారీ ఎత్తున పద్మాలయా స్టూడియో వద్దకు చేరుకున్నారు. వీఐపీల కోసం అరగంట పాటు అభిమానులను నిలిపివేశారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా స్టూడియో లోపలికి అభిమానులు దూసుకుపోయారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు అభిమానుల అదుపు చేస్తున్నారు. అయితే అంతకు ముందు నందమూరి బాలకృష్ణ కృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… కృష్ణ ఎంతో మహోన్నత వ్యక్తి అని, ఆయన నటన పరంగానే కాకుండా వ్యక్తిత్వం కూడా చాలా గొప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంతో మందికి కృష్ణ జీవితాన్ని ఇచ్చారని, భవిష్యత్, వర్థమాన నటులు ఆయన నుంచి నేర్చుకోవాల్సి ఉందన్నారు. ఘట్టమనేని కుటుంబంలో ఒకే ఏడాదిలో ముగ్గురు మరణించడం బాధకరమైన విషయం అని… వారి కుంటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. మరి కొద్దిసేపట్లో పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానంకు కృష్ణ అంతిమ యాత్ర జరగనుంది.