సాధారణంగా మన అభిమాన నటీనటులనో, ఆటగాళ్లనో ఒక్కసారైనా కలుసుకోవాలనే కోరిక చాలామందిలో వుంటుంది. ఆ కల కొందరికి నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. ఒకవేళ నెరవేరితే మాత్రం ఆ తీపి జ్ఞాపకాన్ని ఫోటో రూపంలో బంధించి జీవితాంతం గుర్తుంచుకుంటారు. కానీ, ఓ చిన్నారి అభిమానికి మాత్రం తన అభిమాన క్రికెటర్ ని కలుసుకోవడానికి వచ్చినందువల్ల ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6.5 లక్షల జరిమానా విధించబడింది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు సూపర్-12 గ్రూప్-2లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ నెల 10న ఇంగ్లండ్‌తో జరగనున్న సెమీస్ సమరానికి సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో ఊహించని ఘటన ఒకటి జరిగింది. భారత్‌కు చెందిన ఓ అభిమాని తన ‘హీరో’ రోహిత్ శర్మను కలవాలని అనుకున్నాడు. అంతే.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది అతడి వెనక పరుగులు తీసి మొత్తానికి పట్టుకున్నారు.
ఈ క్రమంలో రోహిత్‌ను చూస్తూనే అభిమాని ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే, అతడు రోహిత్‌ను కలవకముందే సిబ్బంది అతడిని పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, మైదానంలోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించిన ఆ అభిమానిపై రూ. 6.5 లక్షల జరిమానా విధించారు. ఇది విన్న మనకు పాపం అనిపిస్తుంది గానీ, ఆటకు అంతరాయం కలిగించడం మాత్రం వారి నిబంధనలకు విరుద్ధమే గదా…!!