Munugode By Elections : తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయం మరింత వేడెక్కింది. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉద్రిక్తత వాతావరణం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రచారానికి చివరి రోజు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మునుగోడు మండలం పులివెలలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఈటల కార్లు ధ్వంసం అయ్యాయి.
ఈటల ప్రచారారం చేస్తుండగా ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం అందుతుంది. ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకోగా… ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయినట్లు తెలుస్తుంది. పలివెలలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. నియోజకవర్గం వ్యాప్తంగా పటిష్ట బందోబస్తుతో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.
ఈ ఘర్షణ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… బీజేపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగుతుందని, ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సమయమనం పాటించాలని హరీష్ రావు అన్నారు. బీజేపీ కుట్రలో టీఆర్ఎస్ కార్యకర్తలు పడొద్దంటూ సూచించారు. మరోవైపు బీజేపీ ప్రచార రథానికి ఉన్న బ్యానర్లను టీఆర్ఎస్ కార్యకర్తలు చించివేశారని… తన వ్యక్తిగత సిబ్బందికి కూడా గాయాలయ్యాయని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని రాజేందర్ మండిపడ్డారు. ఈ ఘటనలో ఈటల రాజేందర్ కారు కూడా ధ్వంసం అయ్యిందని సమాచారం.