శ్రీకాకుళం: పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పేరుకు మూడు రాజధానులు అని చెప్పినా.. పాలనంతా విశాఖ నుంచే జరుగుతుందని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కాలేజ్‌లో నిర్వహించిన సమావేశంలో ధర్మాన మాట్లాడారు. ఇన్నేళ్ల తర్వాత విశాఖకు రాజధాని రూపంలో మంచి అవకాశం వచ్చిందన్నారు.
రాజధాని ఇష్టం లేని వారు మౌనంగా ఉండాలని.. అంతేకానీ వ్యతిరేకంగా మాట్లాడొద్దని వ్యాఖ్యానించారు. విశాఖ రాజధాని అంశంపై ప్రజల్లో కదలిక రావాలనే రాజీనామా చేస్తానని చెప్పానన్నారు. గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని వద్దని రాష్ట్ర విభజన సమయంలోనే శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. ఒరిస్సాలోని కటక్‌లో హైకోర్టు, భువనేశ్వర్‌లో అసెంబ్లీ ఉన్నాయని గుర్తు చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో వికేంద్రీకరణ జరుగుతోందన్నారు.