Ktr : తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌజ్‌లో జరిగిన సంఘటన ఒక్కసారిగా ఇరు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు రూ. కోట్ల బేరసారాలు చేశారన్న వార్తలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుతం ఈ అంశంపై ఇటు టీఆర్‌ఎస్ నాయకులతో పాటు, అటు బీజేపీ నాయకులు స్పందిస్తున్నారు. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటుండడంతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తమ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్… ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ కేటిఆర్ రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి ప్రగతి భవన్ చేరుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి అన్ని విషయాలు వెల్లడించనున్నారని కొన్ని గంటల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్‌తో కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరికాసేపట్లో మరింత క్లారిటీ రానుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి
అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం
లేదు— KTR (@KTRBRS) October 27, 2022