డ్రగ్స్ కట్టడి, నూతన నేరన్యాయ చట్టాలు, నకిలీ విత్తనాలను అరికట్టడం కోసం తీసుకోవలసిన చర్యల గురించి ఘట్ కేసర్ లోని ఏస్ ఇంజినీరింగ్ కళాశాలలో కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపిఎస్ గారు రాచకొండ డిసిపిలు, అదనపు డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు మాట్లాడుతూ.. నిషేధిత మత్తుపదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిదని, డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను అణచివేయాలని, వారి మీద పిడి చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని, తెలిసీ తెలియక మత్తుపదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తుపదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. NDPS చట్టం అమలు తీరు పట్ల దర్యాప్తు అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, నూతన నేరన్యాయ చట్టాల ప్రకారం దర్యాప్తు విధానాలను పాటించాలని, డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల మీద NDPS చట్టం-1985 ప్రకారం కేసులు నమోదు చేసి నేరస్తులకు గరిష్ఠ శిక్ష పడేలా చేయాలని సూచించారు. ఈ ఏడాది రాచకొండ పరిధిలో ఇప్పటి వరకు 92 కేసులు NDPS చట్టం ప్రకారం నమోదయ్యాయని, 181 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు.
నిషేధిత డ్రగ్స్ వాడడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు. నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కాకుండా చూడాలని, యువతలో మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల అవగాహన కల్పించేలా అన్ని రకాల కళాశాలల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పలు రకాల సామాజిక మాధ్యమాలు, సినిమాల వంటి వాటిలో చూసి డ్రగ్స్ వాడడం పట్ల ఆకర్షణకు లోనయి పిల్లలు తమ జీవితం నాశనం చేసుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జూలై ఒకటవ తేదీ నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్న నేపథ్యంలో పలుకేసుల దర్యాప్తు మరియు విచారణలో పాటించవలసిన నూతన విధానాల మీద అధికారులు మరియు సిబ్బంది అందరూ సంపూర్ణ పరిజ్ఞానం మరియు అవగహన కలిగి ఉండాలని కమిషనర్ సూచించారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ప్రకారం కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులను అలవరచుకోవాలని ఆదేశించారు. రాచకొండ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది నూతన నేరన్యాయ చట్టాలకు సంబంధించిన నూతన అంశాలను నేర్చుకోవడం కోసం పలు న్యాయశాస్త్ర గ్రంథాలను అన్ని పోలీస్ స్టేషన్లకు, డిసిపిలు, అదనపు డీసీపీలు, ఏసిపిలు మరియు ఇతర పోలీసు విభాగాలకు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాములు గారు నూతన చట్టాల మీద సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల సరఫరా, క్రయవిక్రయాలను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యల మీద కమిషనర్ గారు అధికారులకు పలు సూచనలు చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తన, ఎరువుల దుఖానాలపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు. విత్తనాల ప్యాకెట్ల మీద అధీకృత సమాచారం మరియు లోగో హోలోగ్రాం వంటి వాటిని బాగా పరిశీలించాలని, వ్యవసాయశాఖ అధికారులు ధ్రువీకరించిన ప్రముఖ కంపెనీల విత్తనాలు మాత్రమే షాపుల్లో అమ్మేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నకిలీ విత్తనాలను అమ్మేవారిపైన పిడి యాక్ట్ నమోదు చేయాలని, నకిలీ విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను ముందుగా గుర్తించడం, కట్టడి చేయడం, ఎవరు సరఫరా చేస్తున్నారు, ప్రైమరీ కాంటాక్ట్, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిషనర్ ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఫర్టీలైజర్ షాపులపైన ఆకస్మికంగా దాడులు చేసి ప్రతి షాపును క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు ఎవరైనా అమ్మితే వారిపైన చట్టపరమైన కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐపిఎస్, ఎల్ బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, ఎస్బి డీసీపీ కరుణాకర్, డీసీపీ అడ్మిన్ ఇందిరా, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, డీసీపీ సైబర్ క్రైమ్ చంద్రమోహన్, డీసీపీ ఎస్ఓటి మురళీధర్, అదనపు డిసిపిలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.