కన్నడ ప్రాంతీయ అంశంతో రూపొందినప్పటికీ తెలుగు, హిందీ భాషల్లో సైతం వసూళ్ల రికార్డు సృష్టిస్తున్న ‘కాంతార’ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఒకటికి పదిసార్లు చూసి ఆనందిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. అయితే, కన్నడ, తుళు భాషల్లో రూపొందిన ‘పింగార’ చిత్రం గురించి మీరు విన్నారా? ఈ రెండు చిత్రాల అంశం ఒకటే అయినప్పటికీ కమర్షియల్ అంశాలు లేనందున ‘పింగార’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రిషబ్ శెట్టి తన చిన్నతనంలో తన గ్రామంలోని ఒక ఆచారం .. ఆ ఆచారంతో ముడిపడిన కొన్ని సంఘటనలతో ఒక కథను రెడీ చేసుకున్నారు. ఆ కథనే ‘కాంతార’ సినిమాగా తెరపైకి తీసుకుని వచ్చారు. రచయితగా, దర్శకుడిగా, హీరోగా ఈ మూడు పాత్రలకి ఆయన న్యాయం చేశారు.
వివిధ భాషల్లో ఈ సినిమా రాబడుతున్న వసూళ్లే ప్రేక్షకాదరణకు నిదర్శనం. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, తెలుగులో ఈ నెల 15వ తేదీన గీతా ఆర్ట్స్ వారు విడుదల చేశారు. తెలుగులో రెండు కోట్లకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రం విడుదల హక్కులను పొందారు. నిజానికి ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు తెలుగువారికి పెద్దగా తెలియదు. సినిమాలో ప్రధానమైన అంశంగా కనిపించే ఆచారం గురించి ఇక్కడి వారికి తెలియదు. అయినా కంటెంట్ ను ఆసక్తికరంగా నడిపించడంలో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యారు.
కన్నడ ‘కాంతార’తో తుళునాడు కళ-సంస్కృతి-ఆచారాలను దేశమంతటికీ పరిచయం చేశారు. ఈ సినిమాని కమర్షియల్ ఫ్రేమ్‌వర్క్‌లో నిర్మించకపోయి వుండకపోతే, ఇది కూడా ఒక్క జాతీయ అవార్డుకే పరిమితమయ్యేది. అయితే నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి అందరికీ రీచ్ ఫార్ములాతో సినిమాను రూపొందించడంలో విజయాన్ని సాధించారు.
అయితే, ‘కాంతార’ సినిమాతో పోలిస్తే ‘పింగార’ సినిమాని చాలా నిజాయితీగా రూపొందించారంటారు.
ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితులను ఉన్నది ఉన్నట్టు ఎంతో రియలిస్టిక్ గా తీశారు. ఆ సినిమాలో కమర్షియల్ హంగులు లేని కారణంగా పింగారా సినిమాకు పెద్ద గుర్తింపు రాలేదు. ఈ సినిమా విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంది.. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ సినిమా అవార్డు కూడా వచ్చింది. ఎన్నో ఫిలింఫెస్టివెల్‌కు కూడా ఈ సినిమా వెళ్ళింది.