కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్టు వినీత్ నారాయణ్ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీలను బీజేపీ నాయకులు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడుతున్న బీజేపీ నేతలపై గత ఎనిమిదేండ్లుగా ఎందుకు దర్యాప్తు జరగడం లేదని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ అవినీతి జరుగుతున్నదని, ఆ నాయకులేం శుద్ధపూసలేం కాదని ఎద్దేవాచేశారు. తెలంగాణ అభివృద్ధి పథకాలను వినీత్ నారాయణ్ ప్రశంసించారు. ప్రజల్లో కేసీఆర్‌కు మంచి పేరున్నదని తెలిపారు. తాను స్వయంగా తెలంగాణలో పర్యటించానని చెప్పారు. అయోధ్యలో మందిర నిర్మాణంపై బీజేపీ ఎంతో ప్రచారం చేసుకున్నదని, కేసీఆర్ మాత్రం ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండానే యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తున్న అభివృద్ధి మాడల్ దేశానికి అవసరం అని స్పష్టంచేశారు. వినీత్ నారాయణ్ ‘టీ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకొన్నారు. వివరాలు..
కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల పనితీరు ఎలా ఉన్నది?
‘సీబీఐ అవినీతికి శ్మశానంలా మారింది. అది అవినీతి గురించి దర్యాప్తు చేసే సంస్థ కాదు’ అని 30 ఏండ్ల కిత్రం నేను ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాను. ఇప్పుడూ అదే పరిస్థితి ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ రాజకీయ ప్రత్యర్థులను ఫిక్స్ చేసేందుకు సీబీఐ సాధనంగా మారింది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎనిమిదేండ్లలో ఏ ఒక్క బీజేపీ నాయకుడిపైనా సీబీఐ దాడులు చేసిందా? ఎవరినైనా అవినీతి కేసులో జైలుకు పంపారా? అంటే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితర ప్రభుత్వాల్లో అవినీతి జరగడం లేదని అర్థమా? అక్కడ ఎంతో అవినీతి జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదు. రాజకీయ ప్రత్యర్థులు ఉన్న చోటే సీబీఐ సోదాలు చేస్తుంది. అదీ ఎన్నికల సమయంలోనే! సీబీఐకి భయపడి ప్రత్యర్థులు వెనక్కి తగ్గుతారు.. అక్కడ బీజేపీ గెలుస్తుంది. ఇదీ ఇప్పటి పరిస్థితి.
కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలంటే ?
నేను వేసిన పిల్‌పై వచ్చిన తీర్పును అమలు చేస్తే సరిపోతుంది. పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసినా.. దాన్నీ నీరుగార్చారు. బ్యూరోక్రాట్లు, పెద్ద రాజకీయ నాయకులపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని చేర్చారు. ఇలా అధికారుల చేతులు కట్టేస్తే ఆ దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా పనిచేయలేవు.
రాజకీయాల్లో అవినీతి సాధారణ అంశంగా మారింది. అభివృద్ధి ముఖ్యమా? అవినీతిని నిర్మూలించడం ముఖ్యమా ?
ఇది ఎంతో ఆసక్తికర, క్లిష్టమైన ప్రశ్న. ప్రతి ఒక్కరూ అవినీతి గురించి మాట్లాడుతూ, దానిపైనే పోరాడితే గెలుపు సాధించలేరు. సాధారణ ప్రజలు భోజనం, ఇల్లు, ఆరోగ్య వసతులు, విద్య, ఉపాధి గురించి ఆలోచిస్తారు. అందుకే అభివృద్ధే అత్యంత ముఖ్యమైన అంశం. ఆ అభివృద్ధి కండ్ల ముందుండాలి. కేవలం యాడ్స్, ప్రసంగాల్లో కాదు. ఎనిమిదేండ్ల మోదీ పాలన తీసుకుంటే.. గత 40 ఏండ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా ఉపాధి కల్పన పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ గతంలో ఎన్నడూ లేనంత పెరిగింది. విదేశాల నుంచి తెస్తానని మోదీ చెప్పిన నల్లధనం సంగతి మూలకు చేరింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చెప్పేది చాలా.. చేసేది తక్కువ.
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులపై మీ అభిప్రాయం ?
రామానుజ విగ్రహ ప్రారంభోత్సవానికి నేనూ వచ్చాను. అక్కడ చాలామంది నాకు కేసీఆర్ గురించి గొప్పగా చెప్పారు. వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వ చేయూత, ఆరోగ్యం, విద్య, పారిశ్రామీకరణ గురించి నాకు వివరించారు. అప్పుడే సీఎం కేసీఆర్‌ను కలుద్దామనుకున్నా. కానీ, ఆ సమయంలో ఆయన హైదరాబాద్‌లో లేకపోవడంతో కలవలేకపోయాను. జూలైలో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్‌ను కలిశాను. తెలంగాణ గురించి ఎన్డీటీవీలో వచ్చిన ఒక స్టోరీని ఆయన నాకు చూపించారు. మరుసటి రోజు నేను యాదగిరిగుట్టకు వెళ్లాను. ఆలయ నిర్మాణం చూసిన తర్వాత ఎంతో ముగ్ధుడిని అయ్యాను. తెలంగాణలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు పరిశీలించాను. ఎంతో మంది రిటైర్డ్ సివిల్ సర్వెంట్లను, జర్నలిస్టులను, పారిశ్రామికవేత్తలను, విద్యావేత్తలను కలిసి కేసీఆర్ పనుల గురించి అడిగితే వాళ్లు చాలా గొప్పగా చెప్పారు. గత ఎనిమిదేండ్లుగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోవడం నేను గమనించాను.
కేసీఆర్ అభివృద్ధి మాడల్ అనేది జాతీయ స్థాయిలో అవసరమని భావిస్తున్నారా ?
అసలు సమస్య ఏదంటే బీజేపీ, ప్రత్యర్థిపార్టీలను వేధిస్తున్నది. వాళ్లను ప్రజాస్వామ్యయుతంగా పనిచేసుకోనివ్వడం లేదు. బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ర్టాల్లో ఒక రీతిలో.. వాళ్లకు వ్యతిరేక పార్టీలు ఉన్న రాష్ర్టాల్లో ఒక మాదిరిగా బీజేపీ విధానాలు ఉన్నాయి. వాళ్లు రాజకీయపార్టీల మధ్య బేరసారాలు, బెదిరింపులకు తెరతీశారు. కేసీఆర్ దీన్ని చాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీని ఢీకొనే బలమైన ప్రతిపక్షం అవసరం ఉంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అనేది ఓటర్ల చేతుల్లో ఉంది. కానీ, ఇప్పుడు ఒక శక్తిమంతమైన ప్రతిపక్షం అవసరం ఉన్నది.