Bhakthi కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి వారికి ఎన్ని ఉత్సవాలు జరిగినా ప్రతీ ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు మాత్రం పెద్దపీట వేస్తుంది టీటీడీ.. గత రెండేళ్లుగా కరోనా కారణాలతో భక్తులను అనుమతించని టీటీడీ.. ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలకు మాత్రం భారీ ఎత్తున భక్తులకు అనుమతిచ్చింది.. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజున సూర్యప్రభ వాహనంపై మత్స్య నారాయణుడి అలంకారంలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు..
ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో తొమ్మిది రోజులు పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వీటిని ఘనంగా నిర్వహిస్తున్నారు. 88 సాంస్కృతిక కార్యక్రమాలతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు చూడటానికి ఎంతో మంది భక్తులు వచ్చారు.. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు సోమవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు మత్స్య నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. గోవింద నామ స్మరణలతో తిరుమాడవీధులు మార్మోగుతున్నాయి. స్వామి వారి వాహనం ముందు భక్తులు కోలాటాలు చేస్తూ గోవింద నామస్మరణతో శ్రీవారిని స్మరించారు..
ఏడో రోజున సూర్య ప్రభ వాహనంలో కొలువుదీరిన స్వామి వారు.. అదే రోజున సాయంత్రం చంద్రప్రభ వాహనంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఎనిమిదో రోజున ఉదయం ఉభయ దేవేరులతో కలిసి తిరు వీధుల్లో విహరిస్తారు. రాత్రి అశ్వవాహనంపై వచ్చి శ్రీవారు భక్తులను కనువిందు చేస్తారు.