Political చదువుకునేందుకు ఆర్థిక స్థోమత లేదు… ఆదుకునేందుకు నా అనే వాళ్లే లేరు. అలాంటి ఓ యువతికి ఏకంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ల అన్నగా మారారు. ఆమె ఆశయానికి అండగా నిలిచి చేయుతనిచ్చారు. ఆ ప్రోద్భలంతోనే ఆ యువతి అనుకున్న చదువులు చదివించి… ఏకంగా మూడు ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు సాధించి… తన చదువుకు సహకరించిన కేటీఆర్‌ను కలిసి తన ఆనందాన్ని పంచుకుంది.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన అనే యువతి తన చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోయింది. స్థానిక బాలసదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ పూర్తి చేసింది. తర్వాత హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడాలో ఉన్న స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్‌ని పూర్తి చేసింది. ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సీబీఐటీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ సీటు సంపాదించింది. కానీ… నా అనే వాళ్లు ఎవరూ లేని రుద్ర… తన ఫీజులు చెల్లించలేకపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా 2019లో తెలుసుకున్న కేటీఆర్ ఆమెను ప్రగతి భవన్ పిలిపించుకుని… తన చదువుకు అయ్యే ఖర్చులు వ్యక్తిగతంగా భరిస్తానని మాటిచ్చారు. అలా కేటీఆర్ ఆర్థిక సాయంతో ఇంజినీరింగ్ చదువుతున్న రుద్ర రచన…. ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 4 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాన్ని సాధించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఆమెను కేటీఆర్ మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు లేని తనకు మంత్రి కేటీఆర్ ఒక అన్నగా అండగా నిలబడ్డారని, తన కలల సాకారం కోసం తండ్రిగా తపించారని రచన భావోద్వేగానికి లోనైంది. తాను పొదుపు చేసిన డబ్బులతో తయారు చేయించిన వెండి రాఖీని కేటీఆర్‌కు కట్టింది.రచన మాటలకు, అభిమానానికి మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. రచన చేత రాఖీ కట్టించుకున్న కేటీఆర్, ఆమె జీవితంలో మరింత స్థిరపడేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.