Political బేడీలు అంటే తనకు భయంలేదని.. దమ్ముంటే కేసీఆర్ తనను అరెస్టు చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి తాను భయపడేది లేదని… తెలంగాణ ఏర్పడి నాటి నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్ ఎంత ప్రగతి సాధించారో చూపించాలని సవాలు విసిరారు.
వైతెపా అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బేడీలకు తాను భయపడనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 8 ఏళ్లుగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుని పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంతో కీలకమైన ప్రాజెక్టు విషయంలో నాయకులు ఎందుకు ఏమి పట్టనట్టు ఉన్నారో తెలపాలన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా నాయకులు ఎందుకు ఐక్యం కావట్లేదని ప్రశ్నించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎందుకు కేసు పెట్టటం లేదని ప్రశ్నించారు. సామాన్యులకు ఒక న్యాయం..? నాయకులకి ఇంకో న్యాయమా..? అంటూ ప్రశ్నించిన షర్మిల.. తనను అరెస్టు చేసి పాదయాత్ర ఆపాలని చూస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. మంత్రి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్న షర్మిల.. . మహిళలను గౌరవించలేని మనిషికి పదవులు ఎందుకని అన్నారు. రైతుల కనీస అవసరాలు తెలియని ఈయన వ్యవసాయశాఖ మంత్రా అని నిలదీశారు.మహిళను ఎదుర్కొనే ధైర్యం లేక మంత్రి నిరంజన్‌రెడ్డి ఇలా చేస్తారా అని వైఎస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణలో ఇంత జరుగుతున్నా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారని.. ప్రజా సమస్యలపై మాట్లాడే వాళ్ళు లేరని అన్నారు.