Bhakthi పిల్లలు జీవితంలో జరిగే మొదటి శుభకార్యం నామకరణం. హిందూ సాంప్రదాయం ప్రకారం పిల్లాడికి పెట్టే పేరును బట్టి తర్వాత జీవితం ఆధారపడి ఉంటుందని నమ్ముతారు. ఈ పేరును కూడా వాళ్ళు పుట్టిన గడియను బట్టి ఏ అక్షరంతో పెట్టాలో కనుక్కొని మరీ పెడతారు. అయితే ఈ పేరు పెట్టడంలో కొన్ని విషయాలను కచ్చితంగా పాటించాలని సిద్ధాంతాలు చెబుతున్నాయి అవి ఏంటంటే..
సాధారణంగా శిశువు పుట్టిన తర్వాత 11, 16 రోజులు 21 రోజుల తర్వాత ఎప్పుడైనా పేరు పెట్టుకోవచ్చు. అయితే పుట్టిన దగ్గరనుంచి 100 రోజులు లోపు వరకు పేరు పెట్టడానికి అనుకూలంగానే ఉంటుందని తెలుస్తుంది.. అలాగే పుట్టిన గడియలను పంతులుకి తెలియజేసి ఆయన చెప్పిందాని ప్రకారం ఏ అక్షరంతో పేరు పెట్టమంటారో ఆ అక్షరంతో పెట్టడం వల్ల వారి జీవితం దివ్యంగా ఉంటుందని నమ్మకం..
నామకరణం చేసే రోజున బిడ్డను సూర్యభగవానుడి దర్శనమిప్పించాలి. అనంతరం బిడ్డకు స్వయంగా మేనమామ, తాతలు లేదా తల్లిదండ్రుల ఒడిలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. అనంతరం కుడిచెవి దగ్గర పేరును మూడుసార్లు పలకాలి. పిల్లలకు ఇంట్లోనే నామకరణం చేయాలి. అలా కుదరని సమయంలో దేవాలయంలో హోమం పూర్తి చేసి పూజ చేయించి నామకరణం చేయాలి. ఆ సమయంలో బిడ్డ నడుముకు పట్టు దారాన్ని కట్టి, బంగారు ఆభరణాలు వేయాలి. అలాగే అన్ని కొత్త వస్తువులనే ఉపయోగించాలి.. ఆ పవిత్రమైన రోజున శాకాహార భోజనం మాత్రమే ఇంట్లో వండాలి. హిందూ ఆచారాల ప్రకారం, అష్టమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, చతుర్థి, నవమి తిథులనాడు నామకరణం చేయకూడదు. అలాగే 13, 12, 11,10, 7, 6, 5, 3,2,1 ఈ తేదీల్లో నామకరణం చేయకూడదు. ఇలా చేయడం వల్ల వారి మీద ప్రతికూల ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది..