Politics దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు భాజపా ఎమ్మెల్యేలు. గురువారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఐదు ఆటోలను గిఫ్టుగా ఇచ్చారు. ఇకపై ఆయన ఎస్కార్ట్ ఇదేనని, సీఎం భద్రతా సిబ్బంది, ప్రైవేటు సెక్రెటరీ ఈ ఆటోల్లోనే ప్రయాణించాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 12న గుజరాత్ అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్ ఓ ఆటో డ్రైవర్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లారు. ఆయన బస చేసే హోటల్ నుంచి ఆటోలోనే ప్రయాణించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు కేజ్రీవాల్‌ను అడ్డుకున్నారు. కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు భద్రత అవసరం లేదని ఆటోలోనే వెళ్తానని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులే వెనక్కి ఆయనతో పాటు ఆటో డ్రైవర్ ఇంటికి ఎస్కార్ట్‌గా వెళ్లారు.
అయితే కేజ్రీవాల్ తీరును భాజపా తీవ్రంగా విమర్శించింది. ఆయన పబ్లిసిటీ కోసమే పట్టుబట్టి ఆటోలో వెళ్లారని ధ్వజమెత్తింది. ఈ క్రమంలోనే గురువారం కేజ్రీవాల్‌కు ఐదు ఆటోలను కానుకగా ఇచ్చింది. ‘కేజ్రీవాల్ కాన్వాయ్‌లో 27 వాహనాలున్నాయి. 200మంది భద్రతా సిబ్బంది ఉంటారు. కానీ గుజరాత్‌లో ఆయన కావాలని ఆటోలో ప్రయాణించి హైడ్రామా చేశారు. అందుకే ఆయనకు ఐదు ఆటోలు గిఫ్ట్‌గా ఇస్తున్నాం. ఒక ఆటో పైలట్‌గా ఉంటుంది. జాతీయ జెండా ఉన్న ఆటో సీఎం కేజ్రీవాల్ కోసం. మరో రెండు ఆటోలు ఆయనకు ఎస్కార్ట్‌గా వెళ్తాయి. ఇంకో ఆటోలో కేజ్రీవాల్ ప్రైవేటు కార్యదర్శి వెళ్తారు’ అని ఢదిల్లీ ప్రతిపక్షనేత రామ్‌వీర్ సింగ్ బిద్ధూరి సెటైర్లు వేశారు.