politics కొన్నాళ్లుగా విద్యార్థుల లేక ఖాళీగా ఉంటున్న ఓ ప్రభుత్వ పాఠశాలను ఆక్రమించుకుని… ఇంటిగా మార్చుకున్నాడు స్థానిక అధికార పార్టీ వైకాపా నేత. పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన భవనాన్ని తన సొంతింటిగా మార్చుకుని స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పాణ్యం పట్టణంలోని ఇందిరానగర్‌లో వెలుగు చూసింది.
2013 జూన్‌లో రూ.5.30 లక్షలతో పాఠశాలను ప్రభుత్వం నిర్మించింది. ఇక్కడకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో విద్యార్థులను వేరే పాఠశాలకు మార్చిన అధికారులు.. ఐదేళ్ల క్రితం పాఠశాలను మూసివేశారు. దాంతో దీన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన స్థానిక అధికార పార్టీ వైకాపా నేత.. పాఠశాల శిలాఫలకం, బోర్డు తొలగించి తన ఇంటిగా మార్చుకున్నాడు. ఈ ఆక్రమణకు దిగింది… గ్రామ సర్పంచ్ పల్లవి బంధువులు కావడంతో అధికారులు ఏం మాట్లాడడం లేదు. రెండు పడక గదులు, వంట గది, హాలు, బయట బాత్‌రూమ్‌లు, మెట్లు నిర్మించి.. సొంత అవసరాలకు వినియోగిస్తున్నాడు. ఈ విషయం తెలిసినా కూడా స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం… ఆశ్చర్యం కలిగిస్తోంది.
చంద్రబాబు ఆగ్రహం… ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలను వైకాపా నేత ఆక్రమించుకున్న తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు సెటైర్ వేశారు. ఇదిగిదిగో… వైకాపా ప్రభుత్వ ‘‘నాడు – నేడు’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. విద్యార్థులు లేకపోతే విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నించాల్సింది పోయి…కబ్జా చేయడం ఏంటని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు.