మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మూడు రోజులుగా సొంత అసెంబ్లీ స్థానం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అనవరసర ఉద్రిక్తతలకు కారణమౌతూ పాలకపక్షాన్ని, పాలనాయంత్రాంగాన్ని తిట్టిపోయడానికి దీన్ని చక్కటి అవకాశంగా మలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కుప్పం ఒకటి. అది అంతకన్నా ఎక్కువా కాదు, తక్కువా కాదు. ఆయన మూడు రోజలుగా అక్కడే పర్యటిస్తూ అలజడి, అల్లకల్లోలం సృష్టించడం ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధం. నాయకులకు ప్రాతినిధ్యం వహించే స్థానాలు ఉంటాయిగాని ‘శాశ్వత సొంత నియోజకవర్గాలు’ అంటూ ఉండవు. రాయ్ బరేలీ అయినా, అమేఠీ అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది.
రెండు పార్టీలు అధికారం కోసం పోటీపడే పరిస్థితుల్లో ఏ స్థానంలోనైనా రాజకీయ ఉద్రిక్తతలు సహజం. చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన నేత– వేడెక్కిన పరిస్థితులను చాకచక్యంగా చల్లబరచాలి. ప్రజలందరితో ‘నేను మీవాణ్ని’ అని చెప్పాలేగాని ‘మేం అధికారంలోకి వస్తే అధికారుల పని పడతాం. ఇప్పటి పాలకపక్ష కార్యకర్తల భరతం పడతాం,’ అంటూ రాజకీయ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెంచకూడదు. ఇందుకు విరుద్ధంగా మాజీ సీఎం గత మూడు రోజులుగా కుప్పంలో వేస్తున్న వీరంగం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. 72 ఏళ్ల విపక్ష నేత తనకన్నా 40–50 ఏళ్లు చిన్నవారిపై సవాళ్లు విసరడం తెలుగుదేశం సంస్కృతికి అద్దంపడుతోంది.
కుప్పం బాబుకు ఎప్పుడు ‘సొంతం’ అయింది ?
చిత్తూరు జల్లాలోని తన సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజవర్గం నుంచి చంద్రబాబు 1978లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. 1983లో హస్తం గుర్తుపైనే రెండోసారి నిలబడి మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామ నాయుడు చేతిలో 17 వేల 500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కాని, తర్వాత ఆయన చంద్రగిరి జోలికి పోలేదు.
ఈ క్రమంలో చంద్రబాబు 1989 నుంచి 2019 వరకూ కుప్పం నుంచి గెలుస్తూ వస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకకు ఆనుకుని ఉండే ఈ నియోజవకర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఎన్నికయ్యారు టీడీపీ అధినేత. ఈ కారణంగా కుప్పం తన ఇలాకా అనో, ఎదురులేని సామ్రాజ్యమనో అనుకోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమాత్రం సబబు కాదు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కూడా అయిన చంద్రబాబు అక్కడ రోజుల తరబడి తిష్ఠవేసి గలాటా చేయడం రాజకీయ సంస్కారం అనిపించుకోదు.