ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు. కాసేపట్లో శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో వీరిద్దరి సమావేశం జరగనుంది. అమిత్‌షా ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ ఆయన్ను కలవనున్నారు. మునుగోడు సభకు వెళ్లిన అమిత్‌షా అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రానున్నారు. ఈ క్రమంలో నోవాటెల్‌లో రాత్రి 7.30 గంటలకు ఎన్టీఆర్‌తో ఆయన సమావేశం కానున్నారు.
2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం మినహాయిస్తే ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. గత కొంతకాలంగా పాలిటిక్స్‌కి దూరంగా ఉన్న ఎన్టీఆర్‌తో ఇప్పుడు అమిత్‌షా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అమిత్‌షా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూశారని.. ఆ సినిమాలో కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ నటనకు ఆయన ఫిదా అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ను స్వయంగా అభినందించడానికే అమిత్‌షా ఆహ్వానించారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఎన్టీఆర్, అమిత్‌షా భేటీలో ఏయే అంశాలపై మాట్లాడుకుంటారు? రాజకీయాల ప్రస్తావన ఉంటుందా? సినిమాల గురించే మాట్లాడతారా? ఇతర అంశాలేమైనా ఉంటాయా? ఇలా.. ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు ఇటు సినీ, అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వాళ్లిద్దరి భేటీ తర్వాతే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.