ఈ మాట వినగానే ఆశ్చర్యం కలగక మానదు. కానీ, ఇది నిజంగా జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోంది. ఆ కుటుంబ సభ్యురాలైన 67 ఏళ్ల వయసుగల స్త్రీ హృద్రోగంతో బాధపడుతున్నారు. అయితే, అక్కడ చేసిన వైద్యం సత్ఫలితాలనివ్వకపోగా ఇతర అవయవాలు సైతం దెబ్బతినే ప్రమాదం నెలకొంది. పైగా, అమెరికాలో ఆమె వైద్యానికి అవుతున్న ఖర్చు అధికంగా వుంది. దీంతో చవకైన వైద్యం అవసరమైంది. దీంతో భారత దేశానికి తరలించాలని నిర్ణయించారు. ఆ మహిళకు వైద్యాన్ని అందించేందుకు చెన్నైలోని ఒక ఆసుపత్రి అంగీకరించింది.
ఆ మహిళను అమెరికా నుండి ఇండియాకు తరలించేందుకు బెంగళూరులోని ఇంటర్నేషనల్ క్రిటికల్ కేర్ ఎయిర్ ట్రాన్స్ ఫర్ టీమ్ ఈ ప్రయాణ ఏర్పాట్లు చేసింది. అత్యాధునిక వైద్య సదుపాయాలుగల విమానాన్ని ఎయిర్ అంబులెన్స్ గా మార్చగా జూలై 17వ తేదీన ప్రయాణం ప్రారంభమై 23 గంటలపాటు సాగి మధ్యలో టర్కీలోని ఇస్తాంబుల్ లో మాత్రం ఆగింది. అక్కడ విమాన సిబ్బంది మారిన అనంతరం తిరిగి బయల్దేరి చెన్నైకి చేరుకుంది. ప్రస్తుతం చెన్నైలో ఆ మహిళకు చికిత్స జరుగుతోంది. ఆమె త్వరగా కోలుకుని నిండైన ఆరోగ్యంతో జీవించాలని కోరుకుందాం.