ఈ విజయపరంపరలో ఎన్నో ఆటు పోట్లు.. ఎంతో వ్యయం, శ్రమ.. ఎన్నో సమస్యలు, పరిష్కారాలు.. వాటి కోసం మరెన్నో సమావేశాలు.. ఆ ఫలితంగా తెలంగాణ అంతటా నిరంతర విద్యుత్తు వెలుగులు విరజిమ్మాయి. 2018 జనవరి 1న వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాను ప్రారంభించి ఆదివారానికి ఐదేండ్లు పూర్తవుతుంది. ఆరో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం..
2018 జనవరి 1.. సరిగ్గా కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సమయం.. అర్ధరాత్రి 00.00 గంటలు.. భారత రైతాంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే పథకానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు. దేశంలోని రైతులు ఎవరూ ఊహించని విధంగా వారి కలను నిజం చేసిన రోజది. తెలంగాణ ఘనతను చాటిచెప్పేలా మెరిసిన పథకం అది. అప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా అందివ్వని విధంగా వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా, అదీ పూర్తి ఉచితంగా విద్యుత్తును అందజేసిన శుభ సమయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు.. ఐదేండ్లుగా నిరంతరాయ వ్యవసాయ విద్యుత్తు అందుతూనే ఉన్నది. ఈ గొప్ప కార్యం ఐదేండ్లు పూర్తి చేసుకొని 01.01.2023న ఆరో ఏడులోకి అడుగుపెడుతున్నది.
నాడు రైతన్నల కష్టాలు
తెలంగాణ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సాగు నీటిని కాలువల ద్వారా అందించటం కష్టంతో కూడుకొన్న పని. ఇటు కృష్ణా, అటు గోదావరి నదుల కంటే తెలంగాణ భూభాగం ఎత్తులో ఉంటుంది. అందుకే రాష్ట్రంలో బోర్లు, బావులతో వ్యవసాయం చేస్తుంటారు. వీటిల్లోంచి నీటిని తోడాలంటే విద్యుత్తు అవసరం. కానీ సొంత రాష్ట్రం ఏర్పడే వరకు వ్యవసాయానికి విద్యుత్తు ఎప్పుడూ సరిగా అందింది లేదు.
ఐదారు గంటలు.. మూణ్నాలుగు విడతలుగా..
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో తీవ్ర విద్యుత్తు సంక్షోభం ఉన్నది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలన్నీ విద్యుత్తు కోతలు, అరకొర సరఫరాతో కునారిల్లాయి. వ్యవసాయం పరిస్థితి మరీ దుర్భరం. పేరుకే 6 గంటల విద్యుత్తు.. కానీ రోజంతా రెండు విడతల్లో 2 గంటల పాటు విద్యుత్తు ఇస్తే అదే పదివేలు. రాత్రిపూట మరో రెండు విడతలుగా మరో రెండు గంటలపాటు విద్యుత్తు ఇచ్చేవారు. అందులోనూ కోతలు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవటం, లో వోల్టేజీతో తప్పని బాధలు. రాత్రి పూట పాములు, తేళ్లు, విషపు పురుగుల కాట్లతో ఎంతోమంది రైతన్నలు చేన్లలోనే ప్రాణాలు విడిచారు. పంటలు చేతికి రాక.. కండ్లముందే ఎండిపోతుంటే చూడలేక పురుగుల మందు తాగి విగతజీవులైనవారు వందల మంది ఉన్నారు.
ఉద్యమ సమయం నుంచే ఆలోచన
ఉద్యమ సమయంలో తెలంగాణవ్యాప్తంగా పర్యటించిన కేసీఆర్.. రైతుల విద్యుత్తు కష్టాలను స్వయంగా చూశారు. పైగా సొంత నియోజకవర్గం సిద్దిపేట ఎమ్మెల్యేగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు పైరవీలు చేసే పరిస్థితిని ఆయనే స్వయంగా అనుభవించారు. నాటి గడ్డు పరిస్థితులే.. రైతుకు ఏదైనా చేయాలి, ఎంతైనా చేయాలి, ఎంత చేసినా తక్కువే అన్న ఆలోచనకు దారి తీశాయి. ఆ ఆలోచనే.. 24 గంటల నిరంతర విద్యుత్తు.
లెక్కలేనన్ని సమావేశాలు
తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంతా అంధకారం అవుతుందని ఏకంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రే శాపనార్థాలు పెట్టారు. కానీ, రైతులకు మంచి చేయాలన్న విజన్ ఉంటే.. వారి తలరాత మార్చగలనన్న సంకల్పం ఉంటే.. ఎంతటి సమస్యైనా తలవంచక తప్పదు. తెలంగాణను విద్యుత్తు వెలుగుల దివిటీగా మార్చేందుకు సీఎం కేసీఆర్ విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. సమీక్షలు నిర్వహించారు. ఎలాగైనా సరే 24 గంటల కరెంటు ఇచ్చి తీరాలన్న లక్ష్యంతో ప్రణాళికలకు రూపకల్పన చేశారు. ఇందుకు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్‌రావును ఎంపిక చేసుకుని ప్రణాళికలను అమలు చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్వహించిన సమావేశాలు వందల కొద్దీ ఉంటాయి. అన్నింటికంటే మిన్నగా.. 2017లో నాగార్జునసాగర్‌లో నాలుగు విద్యుత్తు సంస్థలకు సంబంధించిన ఇంజినీర్లు, ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. 24 గంటలపాటు విద్యుత్తు ఇవ్వడంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలపై విస్తృత ‘మేధో మథనం’ జరిగింది. క్షేత్రస్థాయి నుంచి సలహాలు, సూచనలు తీసుకుని గట్టి నిర్ణయం తీసుకున్నారు.
పక్కా ప్రణాళికలు
రాష్ట్రంలో అప్పటికే ఉన్న 19 లక్షలకుపైగా వ్యవసాయ కనెక్షన్లకు తోడు, రాబోయే రోజుల్లో వచ్చే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు అందించేందుకు ఏమేం కావాలన్నదానిపై పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో ట్రాన్స్‌మిషన్, డిస్కం వ్యవస్థలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్యను గణనీయంగా పెంచడం, తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచడం ముఖ్యమని గుర్తించారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేయాలని సంకల్పించారు. ఈ ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు.
37,911 కోట్లతో వ్యవస్థల బలోపేతం
క్షేత్రస్థాయిలో 24 గంటల పాటు విద్యుత్తును నిరంతరాయంగా అందించేందుకు వ్యవస్థల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ట్రాన్స్‌కో, డిస్కం వ్యవస్థలను పటిష్ఠం చేసేందుకు రూ.37,911 కోట్లు ఖర్చు చేసింది. ట్రాన్స్‌కోలో అతిముఖ్యమైన 400 కేవీ సబ్‌స్టేషన్లను 2 నుంచి 23కు పెంచింది. 220 కేవీ సబ్‌స్టేషన్లను 51 నుంచి 99కి, ఈహెచ్‌టీ లైన్ల పొడవును 16,379 సర్క్యూట్ కిలోమీటర్ల నుంచి 27,573 సర్క్యూట్ కిలోమీటర్లకు పెంచింది. డిస్కంల పరిధిలో 33 కేవీ సబ్‌స్టేషన్లను 2,138 నుంచి 3,190కి పెంచగా, ఎల్టీ లైన్ల పొడవును 4.89 లక్షల కిలోమీటర్ల నుంచి 6.67 లక్షల కిలోమీటర్లకు పెంచింది.
ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి..
విద్యుత్తు వ్యవస్థలను బలోపేతం చేసి, సరఫరాను ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో మొదలుపెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2017 జూలై 16న, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో 2017 జూలై 18న 24 గంటల విద్యుత్తు సరఫరాను ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో సాంకేతికంగా ఏర్పడే సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు సరిచేశారు. ఆ సమస్యలు మిగతా ప్రాంతాల్లో రాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. కొన్ని నెలల పాటు నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావటంతో.. ఒక్కో జిల్లాను అనుసంధానం చేసుకొంటూ, అన్ని జిల్లాలను అనుసంధానం చేశారు. సాంకేతిక సమస్యలను, లోటుపాట్లను ఎప్పటికప్పుడు పరిష్కరించి 2018 జనవరి 1న ముహూర్తం నిర్ణయించారు.
విద్యుత్తు స్థాపిత సామర్థ్యం పెంపు
ముందుగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచాలని తలచిన ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొన్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 7,778 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉండగా.. ఈ డిసెంబరు నాటికి దాన్ని 18,829 మెగావాట్లకు చేర్చారు. పులిచింతలలో 30 మెగావాట్ల నాలుగో యూనిట్, కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్లాంట్, 270 మెగావాట్ల సామర్థ్యంతో ఉండే నాలుగు యూనిట్ల భద్రాద్రి థర్మల్‌పవర్ ప్లాంట్ (1,080 మెగావాట్లు)ను నిర్మించి ప్రారంభించింది. దీనికి సింగరేణి 1,200 మెగావాట్లు జత చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 74 మెగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్తును 5,117 మెగావాట్లకు తీసుకుపోయారు. యాదాద్రిలో 4,000 మెగావాట్లు సహా మరో 8,705 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటికోసం రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నది.
ట్రాన్స్‌ఫార్మర్లు.. సిబ్బంది
రైతులకు 24 గంటల విద్యుత్తును అందించడానికి ఉన్న ప్రధాన అవరోధాల్లో ఒకటి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం. రాష్ట్రం రాకముందు ఈ ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్ శాతం 30 ఉంటే, దాన్ని ఇప్పుడు 7 శాతానికి తగ్గించగలిగారు. ఇందుకోసం లో వోల్టేజీని అరికట్టారు. అప్పట్లో 4.67 లక్షల డీటీఆర్‌లు ఉంటే ఇప్పుడు వాటిని 8.40 లక్షలకు పెంచారు. పీటీఆర్‌ల సంఖ్యను కూడా 3,272 నుంచి 5,643కు పెంచడంతో ఫెయిల్యూర్ శాతం గణనీయంగా తగ్గింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత లేకుండా చేశారు. ఏకంగా 22 వేలకుపైగా ఆర్టిజాన్లను రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే స్పందించి, విద్యుత్తు అంతరాయాన్ని అరికట్టేలా చూడగలుగుతున్నారు. 9,909 మంది ఉద్యోగులు, ఇంజినీర్లను విద్యుత్తు సంస్థలు నియమించుకొన్నాయి. దీనితో వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇవ్వడం విజయవంతమైంది.
33 శాతం విద్యుత్తు వ్యవసాయానికే
రాష్ట్రంలో వినియోగించే విద్యుత్తులో 33 శాతం వ్యవసాయానికే వినియోగిస్తున్నట్టు అధికారులు లెక్కలు వేశారు. వానకాలంలో కంటే.. యాసంగిలో వ్యవసాయానికి విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటున్నది. అందుకు అనుగుణంగానే విద్యుత్తు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.
తెలంగాణ ఖ్యాతి దేశవ్యాప్తమైంది
రైతాంగానికి 24 గంటలపాటు ఉచిత కరెంటు ఇవ్వటం సీఎం కేసీఆర్ కల. దాన్ని వాస్తవంలోకి తీసుకొచ్చేందుకు విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు, సిబ్బంది ఒక టీంలా పనిచేశారు. విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను సొంతంగా నిర్మించాం. రూ.37,911 కోట్లతో ట్రాన్స్‌మిషన్, డిస్కం వ్యవస్థలను బలోపేతం చేశాం. ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్యను, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాం.
వ్యవసాయం, ఉచిత విద్యుత్తు, 24 గంటల కరెంటుపై పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవి..
★ వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు నిరంతర ఉచిత విద్యుత్తుకు అయ్యే ఖర్చు కన్నా, తద్వారా వచ్చే పంట దిగుబడితో రాష్ర్టానికి, ప్రజలకు వచ్చే రాబడి చాలా చాలా ఎక్కువ
★ పూర్తి ఉచిత విద్యుత్తు కోసం రైతులకు పెట్టే ఖర్చును ప్రభుత్వం ఎప్పుడూ భారంగా పరిగణించకూడదు.
★ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా.. వ్యవసాయానికి విద్యుత్తు విషయంలో రైతులు అనేక బాధలు ఎదుర్కొనే వారు. ముఖ్యంగా, 100 కేవీఏ, 63 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల కోసం పైరవీలు చేయాల్సి వచ్చేది. మంత్రులతో సిఫారసు చేసే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాలి. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను తక్షణం మార్చేలా వ్యవస్థను రూపొందించాలి
★ రైతులకు ఎంత చేసినా తక్కువే. రైతులకు చేసే లాభం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయి. ఆ సంపదంతా తిరిగి ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
ఐదేండ్లుగా నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. ఇది దేశానికి తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పింది. తెలంగాణ రైతాంగం నేడు భారీగా సాగు చేయడానికి కాళేశ్వరం నీరు, మేమిస్తున్న విద్యుత్తు భరోసాయే కారణం. ఈ ఘన విజయం వెనుక సీఎం కేసీఆర్ ముందుచూపు, మార్గదర్శనం, విద్యుత్తు ఉద్యోగుల టీం వర్క్ ఉందని గర్వంగా చెప్పగలను.
– దేవులపల్లి ప్రభాకర్‌రావు, సీఎండీ, ట్రాన్స్‌కో, జెన్‌కో